వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసే రేసులో భారత్ స్థానం ఎంత ?

Update: 2021-11-01 11:37 GMT
కరోనా వైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టేసరికి ప్రజలందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానీ, కరోనా వ్యాధి తీవ్రత తగ్గినా, ప్రస్తుతం డెంగీ కేసులు మాత్రం నిర్విరామంగా పెరిగిపోతూ అందర్నీ వణికిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా వైద్యులు, హెల్త్ కేర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. డెంగీ కేసుల్లో భారీ పెరుగుదల నమోదు కావడమే కాదు కొత్త జాతుల విజృంభన వల్ల సంబంధిత లక్షణాలు మరింత తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో డెంగీ వ్యాక్సిన్ చాలా కీలకం. కానీ దేశంలో డెంగీ జ్వరానికి ఇప్పటివరకు సురక్షితమైన, సమర్థవంతమైన టీకాని అభివృద్ధి చేయలేదు.

ఇప్పట్లో వ్యాక్సిన్ వస్తుందనే సూచనలు కూడా కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటి , అసలు వ్యాక్సిన్ ఉందా లేదా అంటే .. డెంగీ అనేది డెంగీ వైరస్ వల్ల దోమల ద్వారా సంక్రమించే వైరల్ వ్యాధి. ఉష్ణమండల వాతావరణం లో వైరల్ ఇన్‌ ఫెక్షన్ ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. డెంగీ ప్రధానంగా ఈడెస్ ఈజిప్టి జాతికి చెందిన ఆడ దోమల ద్వారా వస్తుంది. అలాగే కొంతమేర ఏఈ ఆల్బోపిక్టస్ ద్వారా కూడా డెంగీ వ్యాపిస్తుంది. ఇది డీఈఎన్వీ అనే డెంగీ వైరస్ వల్ల వస్తుంది. డబ్ల్యూహెచ్ ఓ ప్రకారం చాలా డెంగీ ఇన్‌ ఫెక్షన్లు అంతగా ప్రమాదకరమైనవి కావు. ఇంట్లో చికిత్స ద్వారా వీటి నుంచి బయటపడొచ్చు. కానీ చికిత్స పొందకుండా నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాలు హరించే తీవ్రమైన డెంగీగా అభివృద్ధి చెందుతుంది.

ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన డెంగీ అనేది DENV-1, DENV-2, DENV-3, DENV-4 అనే నాలుగు విభిన్న సెరోటైప్‌ ( ల వల్ల వస్తుంది. అన్ని జాతులలో DENV 2 లేదా స్ట్రెయిన్ D2 అత్యంత తీవ్రమైనదిగా పరిగణిస్తారు. ఇది అంతర్గత రక్తస్రావం, డెంగీ షాక్‌ సిండ్రోమ్‌కు కూడా దారితీయవచ్చు. కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలతో సహా భారతదేశంలో డెంగీ ఇన్ఫెక్షన్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. రుతుపవనాలు, కాలానుగుణ మార్పులు అంటువ్యాధుల పెరుగుదలకు దారితీస్తున్నాయి. ఈ ఏడాది దోమల వల్ల సంక్రమించే వ్యాధుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

డెంగీ నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. అయినప్పటికీ, ఫ్లూ షాట్ లేదా కోవిడ్-19 వ్యాక్సిన్‌ల వలె డెంగీ కోసం సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ ఇప్పటికీ భారత దేశంలో అందుబాటులో లేదు. అయితే డెంగీ నివారణగా మొదటి వ్యాక్సిన్ గా డెంగ్వాక్సియా అనే డెంగీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇది 2015లో లైసెన్స్ పొందింది. దీనిని కొన్ని దేశాల్లో 9-45 ఏళ్ల వయస్సు గల వ్యక్తులకు అందిస్తున్నారు. ఒకవేళ వ్యాక్సిన్ తీసుకున్న వారికి గతంలో డెంగీ వైరస్ సంక్రమించకుండా.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే సంక్రమిస్తే.. అది తీవ్ర డెంగీగా అభివృద్ధి చెందే ప్రమాదం ఉందని వ్యాక్సిన్ తయారీదారు సనోఫీ పాశ్చర్, 2017లో వెల్లడించినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.

బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ -టాటా ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌ కు చెందిన భారతీయ శాస్త్రవేత్తలు డెంగీ వైరస్‌ నివారణకు డీఎన్ఏ వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసినట్లు ఇటీవలి నివేదికలు సూచిస్తున్నాయి. ఈ పరిశోధకులు వైరస్ నాలుగు సెరోటైప్‌ల నుండి EDIII అని పిలిచే అత్యంత ముఖ్యమైన వైరల్ ప్రోటీన్‌ లో కొంత భాగాన్ని ఎంచుకున్నారు. వారు తీవ్రమైన డెంగీకి కారణమయ్యే DENV2 సెరోటైప్ నుంచి NS1 ప్రోటీన్‌ను కూడా ఎంచుకున్నారు. తద్వారా తీవ్రమైన డెంగీని నివారించాలని కృషి చేస్తున్నారు.


Tags:    

Similar News