ఆయనతో మోడీకి చెక్ చెప్పాలనుకుంటున్నారు

Update: 2016-05-26 04:56 GMT
ప్రధాని నరేంద్ర మోడీకి చెక్ చెప్పేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. తనకు ఎదురే లేనట్లుగా దూసుకెళుతున్న మోడీకి స్పీడ్ బ్రేకర్లు వేసేందుకు ఓ పెద్ద మనిషిని రాజ్యసభకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారట లాలూ. ప్రముఖ న్యాయ కోవిదుడు.. మోడీ అంటే పెద్దగా పడని రాం జెఠ్మాలానీని రాజ్యసభకు పంపాలని భావిస్తున్నారట. ఇందుకోసం ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్లుగా తెలుస్తోంది.

తన వాదనతో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెట్టే జెఠ్మాలానీ లాంటి వ్యక్తిని రాజ్యసభకు పంపితే మోడీ సర్కారుకు చుక్కలు కనిపించటం ఖాయమన్నది లాలూ భావన. ఇదే కాదు.. తొలినాళ్లలో మోడీకి మద్దతు పలికి.. ఆ తర్వాత ఆయనతో విభేదించిన జెఠ్మాలానీని రాజ్యసభకు పంపితే.. తన వాదనతో మోడీ సర్కారును ఇబ్బంది పెట్టటం ఖాయమని భావిస్తున్నారు. మోడీ లాంటి వ్యక్తికి ఈ సీనియర్ లాయర్ సరిగ్గా సరిపోతారని భావిస్తున్నారట.

ఇక్కడే మరో పోలిక కూడా ఉంది. తన అద్భుతమైన వాదనా పటిమ.. ప్రత్యర్థులపై తాను చేసే ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేసే బీజేపీ నేత సుబ్రమణ్యస్వామిని కమలనాథులు ఇటీవలే రాజ్యసభకు పంపటం.. వారి అంచనాలకు తగినట్లే కాంగ్రెస్ అండ్ కోలకు స్వామి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే తీరులో రాంజెఠ్మాలానీతో మోడీ సర్కారుకు షాకులు ఇవ్వాలని లాలూ భావిస్తున్నారట. ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఈ వాదన నిజమైతే.. రాజ్యసభలో బీజేపీ తలపోటు ఖాయమని చెప్పక తప్పదు.
Tags:    

Similar News