ఈ మ‌హిళా మంత్రుల‌కేమైంది.. నిన్న ఉష‌శ్రీ.. నేడు రోజా!

Update: 2022-08-18 10:38 GMT
ప‌విత్ర పుణ్యక్షేత్రం తిరుమ‌ల భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతోంది. ఆగ‌స్టు 13 వ‌రుస‌గా నాలుగు రోజులు సెల‌వులు రావడంతో భ‌క్తులు ఒక్క‌సారిగా తిరుమ‌ల‌కు పోటెత్తారు. స‌ర్వ‌ద‌ర్శ‌నానికి ఏకంగా 40 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. ప్ర‌త్యేక ద‌ర్శ‌నానికి ఆరేడు గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను, వీఐపీ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేశామ‌ని చెప్పింది. కొత్త‌గా వ‌చ్చే భ‌క్తుల‌ను కూడా త‌మ ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకోమ‌ని కోరింది. రోజా

స్వామివారి ద‌ర్శ‌నానికి క్యూలు కూడా కిలోమీట‌ర్ల కొద్దీ విస్త‌రించి ఉన్నాయి. రూములు దొర‌క‌క భ‌క్తులు ఎక్క‌డిప‌డితే అక్క‌డే విశ్ర‌మిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ కొంద‌రు మంత్రులు అధికార ద‌ర్పం ఒల‌క‌బోయ‌డం.. సాధార‌ణ భ‌క్తుల క‌ష్టాల‌ను ప‌ట్టించుకోకపోవ‌డం వివాదం రేపుతోంది. పోనీ మంత్రులు ఒక్క‌రే వ‌స్తున్నారా అంటే అదీ కాదు.. మందీ మార్బ‌లంతో, అనుచ‌రుల‌తో స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చి వీఐపీ ద‌ర్శ‌నాలు చేసుకుంటున్నారు. దీంతో సాధార‌ణ భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాన్ని నిలిపివేస్తున్నారు.

ఆగస్టు 15న మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ తన నియోజ‌కవర్గానికి చెందిన  50 మందితో కలిసి శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆ సమయంలో కొండ మొత్తం భక్తులతో కిట‌కిట‌లాడుతోంది. దర్శనానికి 30 గంటల వరకు సమయం పడుతోంది. అయినా..తనతోపాటు త‌న‌ అనుచరగణానికి వీఐపీ ద‌ర్శ‌నం ద‌క్కేలా మంత్రి త‌న అధికార ద‌ర్పాన్ని చూపారు. ప‌ది మందికి సుప్ర‌భాతం టికెట్లు కూడా ఇప్పించారు.

ఇక ఇప్పుడు తానేమి త‌క్కువ తిన్నాన‌ని అనుకున్నారో ఏమో.. మరో మ‌హిళా మంత్రి  ఆర్కే రోజా సైతం ఇటువంటి విమర్శలకే కారణమయ్యారు. పెళ్లిళ్ల సీజన్ ..సెలవుల‌తో తిరుమ‌లలో ర‌ద్దీ ఎక్కువగా ఉంది. రద్దీ కారణంగా ఆగ‌స్టు 21 వీఐపీ సిఫార్సు లేఖలు అనుమతించటం లేదని.. బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లుగా ఇప్పటికే టీటీడీ ప్రకటించింది.

అయితే, ఆగ‌స్టు 18న‌ మంత్రి ఆర్కే రోజా 30 మంది అనుచరులతో కలిసి దర్శనానికి వెళ్లారని అంటున్నారు. అందులో పది మందికి టీటీడీ ప్రోటోకాల్ దర్శనం....మరో 20 మందికి బ్రేక్ దర్శనం అవకాశం కల్పించార‌ని చెబుతున్నారు. తనతో పాటుగా వచ్చిన అనుచరులు దర్శనం పూర్తి చేసుకొనే వరకూ మంత్రి రోజా అక్క‌డే ఉన్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఓ వైపు వీఐపీ ద‌ర్శ‌నాలు, బ్రేక్ ద‌ర్శ‌నాలు, సిఫార్సు లేఖ‌లు లేవంటూ టీటీడీ చెప్పేవ‌న్నీ అబ‌ద్ధాల‌ని భ‌క్తులు మండిప‌డుతున్నారు. బ్రేకు ద‌ర్శ‌నాలు లేవంటూ మంత్రులతో వచ్చిన వారికి వీఐపీ ద‌ర్శ‌నాలు క‌ల్పించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

తాము పిల్లా పాప‌ల‌తో, ఆడ‌వాళ్ల‌తో, వృద్ధుల‌తో ద‌ర్శ‌నానికి అష్ట‌క‌ష్టాలు ప‌డుతుంటే టీడీడీ మాత్రం వీఐపీలు, సెల‌బ్రిటీల సేవ‌లో త‌రిస్తుంద‌ని నిప్పులు చెరుగుతున్నారు. తాము ద‌ర్శ‌నం కోసం క్యూలైన్ల‌లో గంట‌ల త‌ర‌బడి వేచి ఉంటే.. మంత్రి రోజా అనుచ‌రుల‌కు ద‌ర్శ‌నం ఎలా క‌ల్పిస్తార‌ని ధ్వ‌జ‌మెత్తుతున్నారు.

కాగా రోజా మాత్రం తమవారు జనరల్ దర్శనం చేసుకున్నారని తెలిపారు. టీటీడీ నిర్ణయాన్ని గౌరవించాలి కదా.. బ్రేక్ దర్శనం ఈ నెల 21 వరకు అందరికి ఇవ్వడానికి లేద‌న్నారు.. మా నగిరి నియోజకవర్గ లీడర్లు ద‌ర్శ‌నం కోసం వచ్చారు.. జనరల్‌లో దర్శనం చేసుకుని వెళ్తున్నాం అని మంత్రి రోజా స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News