పవన్ చేతికి రోడ్ మ్యాప్ : నడ్డాతో భేటీకి ముహూర్తం...?

Update: 2022-05-29 15:30 GMT
కొద్ది నెలల క్రితం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుంచి రోడ్ మ్యాప్ వస్తే దానికి అనుగుణంగా ఏపీలో పనిచేస్తామని, వైసీపీని గద్దెను దించుతామని చెప్పారు. అయితే  దాని మీద వైసీపీ నుంచి రకరకాలైన విమర్శలు వచ్చాయి. అదే టైమ్ లో విశ్లేషకులు కూడా జనసేన గురించి  కామెంట్స్ చేశారు. సొంతంగా పార్టీని నడుపుతున్న పవన్ వేరే పార్టీ వారి రోడ్ మ్యాప్ గురించి చూడడం ఏంటి అని కూడా అన్నారు.  వామపక్షాల నుంచి కూడా ఇదే తీరున విమర్శలు వచ్చాయి.

ఇదిలా ఉంటే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుంది. రెండు పార్టీలు ఉమ్మడిగా ముందుకు సాగాలని అనుకుంటున్నాయి. అందుకోసం పొలిటికల్ రోడ్ మ్యాప్ ఏపీకి సంబంధించి పవన్ కోరడంలో తప్పేముంది అన్న మాట కూడా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్యన మంగళగిరి పార్టీ ఆఫీసుకు వచ్చిన పవన్ తనను కలసిన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తామని, ఈ విషయంలో బీజేపీ పెద్దలతో కూడా మాట్లాడి ఒప్పిస్తామని చెప్పుకొచ్చారు.

ఇపుడు ఆ టైమ్ కచ్చితంగా వచ్చినట్లుగా ఉంది. వచ్చే నెల అంటే జూన్ లో ఏపీకి బీజేపీ నాయకులు వస్తున్నారు. ముందుగా జూన్ నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీకి వస్తున్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా జూన్ 7, 8 తేదీలలో ఏపీలో పర్యటిస్తారు. అదే విధంగా రాజమహేంద్రవరంలో జరిగే బహిరంగ సభలో కూడా ఆయన పాలుపంచుకుంటారు.

ఈ బహిరంగసభ బీజేపీ ఆలోచనలు, ఏపీ మీద ఎలాంటి వ్యూహాన్ని రూపొందిస్తారు అన్నది కొంతవరకూ తేటతెల్లం చేయవచ్చు అంటున్నారు. అదే టైమ్ లో ఏపీలో పొత్తుల ఎత్తులు కూడా సాగుతున్న వేళ జేపీ నడ్డా టూర్ లో  ఆ దిశగా కూడా ఫోకస్ పెడతారని అంటున్నారు.

ఇదిలా ఉంటే జేపీ నడ్డాతో జూన్ 8న జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు అని కూడా తెలుస్తోంది. ఈ సందర్భంగా రెండు పార్టీలు ఏపీ రాజకీయాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఖరారు చేస్తారు అని అంటున్నారు. ఏపీలో వైసీపీతో సమరమే అని బీజేపీలోని కొన్ని వర్గాలు అంటున్నాయి. అదే టైమ్ లో జేపీ నడ్డా ఏపీలో బీజేపీ జనసేన అనుసరించాల్సిన వ్యూహాలని రూట్ మ్యాప్ ని ఖరారు చేస్తారు అని తెలుస్తోంది.

మొత్తానికి పవన్ అడిగిన రూట్ మ్యాప్ కొద్ది నెలలు ఆలస్యం అయినా కూడా పవన్ చేతికి బీజేపీ ఇవ్వబోతోంది అని అంటున్నారు. మరి ఆ రూట్ మ్యాప్ లో జనసేన బీజేపీ మాత్రమే ఉంటాయా లేక టీడీపీ కూడా ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. అదే టైమ్ లో ఈ రూట్ మ్యాప్ ద్వారా వైసీపీ మీద బీజేపీ అనుసరించే వైఖరి కూడా తేటతెల్లం కానుంది. మొత్తానికి జూన్ నెలలో ఏపీ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు అనేకం చోటు చేసుకోబోతున్నాయని అంటున్నారు.
Tags:    

Similar News