రూపాయి విలువ ప‌డిపోవ‌టానికి అల్లుడికి లింకు?

Update: 2018-09-27 05:52 GMT
అల్లుడిగారికి కోపం వ‌చ్చింది. అది కూడా అలా ఇలా కాదు. ప్ర‌తి దాంట్లోనూ త‌న‌కు లింకు ఉందంటూ త‌న పేరును ప్ర‌స్తావించ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కీ.. అల్లుడుగారు ఎవ‌రో అర్థ‌మైందిగా?  సోనియాగాంధీ అల్లుడు రాబ‌ర్ట్ వాద్రాకు కోపం వ‌చ్చేసింది.

రాఫెల్ డీల్ లో పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయిన మోడీ బ్యాచ్.. తాజాగా వాద్రాపై ఆరోప‌ణ‌లు ఎక్కుపెట్ట‌టం తెలిసిందే. రాఫెల్ డీల్ లో వాద్రా హ‌స్తం ఉంద‌న్న మాట‌ను ప్ర‌చారంలోకి తెచ్చే ప్ర‌య‌త్నం చేయ‌టం.. ఆ క్ర‌మంలో కాంగ్రెస్ వినిపించిన వాద‌న‌ల‌తో వాద్రాకు ఎలాంటి సంబంధం లేద‌న్న వాద‌న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఇలాంటి వేళ‌.. వాద్రా గ‌ళం విప్పారు.

బీజేపీ చిక్కుల్లో ప‌డిన ప్ర‌తిసారీ త‌న‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఉంటుంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. త‌న‌కు మొద‌ట్లో చాలా ఆశ్చ‌ర్య‌మేసేద‌ని.. కానీ ఇప్పుడు అదో ఫార్సులా మారింద‌న్నారు. రూపాయి విలువ ప‌డిపోయినా అందుకు తానే కార‌ణ‌మ‌న్న‌ట్లుగా బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తుంటార‌ని ఎద్దేవా చేశారు.

రూపాయి విలువ ప‌డిపోయినా.. చ‌మురు ధ‌ర‌లు పెరిగినా.. తాజాగా రాఫెల్ కు దేశం మొత్తాన్ని తాక‌ట్టు పెట్టి అడ్డంగా దొరికిపోయినా వేళ‌లోనూ త‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేయ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వారు ఇరుకున ప‌డిన ప్ర‌తిసారీ నాపై విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటార‌న్నారు.

ఉత్తుత్తి అబ‌ద్ధాలు చెప్పే బ‌దులు 56 అంగుళాల ఛాతీ వీరులు బ‌య‌ట‌కు వ‌చ్చి దేశ ప్ర‌జ‌ల‌కు నిజాలు చెప్పాల‌న్నారు. గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో ఈసారి రాబ‌ర్ట్ వాద్రా ఘాటుగా క‌మ‌ల‌నాథుల మీద విరుచుకుప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తానికి అల్లుడుగారు త‌న ఆవేద‌న‌ను బీజేపీపై ఎట‌కారం చేయ‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News