ఆటకే అందం.. ఫెదరర్.. అందుకే టెన్నిస్ గ్రేట్

Update: 2022-09-16 06:48 GMT
టెన్నిస్ చరిత్రలో పీట్ సంప్రాస్ లాంటి ఎందరో మేటి ఆటగాళ్లు వచ్చి ఉండవచ్చు.. ఆండ్రీ అగస్సీ లాంటి మరెందరో గొప్ప ఆటగాళ్లు వచ్చి ఉండవచ్చు.. జకోవిచ్.. నాదల్ వంటి ఇంకెందరో
ప్రతిభావంతులను ప్రజలు చూసి ఉండవచ్చు.. కానీ, వీరందరిలో అతడు మాత్ర ప్రత్యేకం.. అతడు ఆటకే అందం.. అతడి ఆటలోని సొగసు మరెవరికైనా అసాధ్యం.. బాల్ ను బలంగా
కొట్టలేకపోవచ్చు.. కసికసిగా ఆడుతున్నట్లు కనిపించకపోవచ్చు.. బాడీ లాంగ్వేజ్ లో దూకుడు లేకపోవచ్చు.. కానీ, ఇవన్నీ ఉన్న ఆటగాడి కంటే ఎక్కువ ఫోర్స్ అతడి ఫోర్ హ్యాండ్ షాట్ లో
ఉంటుంది. అలాఅలా ఒంటిచేత్తో అలవోకగా కొట్టే బ్యాక్ హ్యాండ్ షాట్.. చూస్తూ ఉండిపోవాలనింపిచే సర్వీస్.. అవతలి ఆటగాడిని నివ్వెరపరుస్తూ కొట్టే డ్రాప్ షాట్లు.. ఇదీ ఫెదరర్ గురించి
క్లుప్తంగా చెప్పాలంటే.. అలాంటి దిగ్గజం గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్ లో 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో టాప్- 3లో ఒకడిగా కెరీర్ ను ముగించాడు.

అతడి లోటు ఇతడితో పీట్ సంప్రాస్.. 2000వ దశకం వరకు టెన్నిస్ ను ఏలిన రాజు. అచ్చం ఫెదరర్ లాగే అన్నిట్లోనూ ఉత్తమం. ఆటలోనే కాదు.. ప్రవర్తనలోనూ సరిజోడు. అలాంటి సంప్రాస్ 14 గ్రాండ్ స్లామ్ లతో కెరీర్ ను ముగించాడు. సంప్రాస్ ఆల్ టైమ్ గ్రేట్ గా మిగిలిపోతాడని అప్పట్లో అంతా భావించారు. మరెవరూ అతడి దరిదాపుల్లోకి రానని అనుకున్నారు. కానీ, సంప్రాస్ శకాంతం అవుతుండగా ఫెదరర్ వచ్చాడు. అలాఇలా కాదు దూసుకొచ్చాడు. 14 టైటిళ్ల రికార్డను కొల్లగొట్టాడు. 20కి చేరాడు. ఇక ఆ రికార్డును తుడిచిపెట్టడం సాధ్యం కాదని అనుకున్నారు. 8
వింబుల్డన్‌ టైటిళ్లు గెలిచిన ఫెదరర్.. 6 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌,5 యూఎస్‌ ఓపెన్‌ నెగ్గాడు. సంప్రాస్ కు అందని ద్రాక్షగా మిగిలిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ను ఓసారి నెగ్గాడు. వాస్తవానికి చూస్తే 17వ
గ్రాండ్ స్లామ్ ను  2012లోనే ఫెదరర్ సాధించాడు. అప్పటికి నాదల్ 10, జకోవిచ్ 5 టైటిళ్లు మాత్రమే నెగ్గారు. కానీ.. మిగతా మూడు టైటిళ్లకు ఫెదరర్ మరో ఆరేళ్లు తీసుకున్నాడు. 2018  
ఆస్ట్రేలియన్ ఓపెన్ అతడు నెగ్గిన చివరి టైటిల్.

ఎందుకింత గొప్ప..? నాదల్ 22 గ్రాండ్ స్లామ్ లు,  జకోవిచ్ 21 టైటిళ్లు.. గెలిచారు. కానీ, వారితో పోలిస్తే ఫెదరరే గొప్ప అని చెప్పక తప్పదు. కళాత్మక ఆటతీరు.. తాను ఆడిన కాలంలో ఎదుర్కొన్న పోటీ.. అన్నిటికి మించి ప్రవర్తన.. ఇవన్నీ ఫెదరర్ కు గొప్పదనాన్ని ఆపాదించాయి. క్లాస్ అంటాం చూడండి.. అది ఫెదరర్ ఆటలో కొట్టొచ్చినట్లు ఉంటుంది. ఎప్పుడో 1998లో ప్రారంభమైన కెరీర్ 24 ఏళ్ల పాటు ఎలాంటి వివాదాలు లేకుండా సాగడం అంటే మామూలు మాటలు కాదు. దీంతోనే అతడు అభిమానులకు మరింత చేరువయ్యాడు.

ఆట సొగసు.. మాట సొగసు.. క్రికెట్ లో సచిన్ స్ట్రయిట్ డ్రైవ్ ఎవరికీ సాధ్యం కాదు.. కోహ్లీ కవర్ డ్రైవ్ మరెవరికీ రాదు.. ధోని హెలికాప్టర్ షాట్ ఇంకెవరూ అంత బలంగా కొట్టలేరు.. టెన్నిస్ లోనూ అలాగే.. ఫెదరర్ తరహాలో మరెవరూ ఆడలేరు.  కొవిడ్ కారణంగా మధ్యలో కొంత విరామం వచ్చినా 41 ఏళ్ల ఫెదరర్ ఏడాది కిందటి వరకు మంచి టచ్ లోనే కనిపించాడు. అయితే, ఇప్పటికే గాయాలతో సతమతం అవుతుండడంతో గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

వచ్చే వారం లండన్‌లో లేవర్‌ కప్‌ తర్వాత ఆట నుంచి వైదొలగనున్నట్ల ప్రకటించాడు. 'టెన్నిస్‌ లో నాకు దొరికిన గొప్ప బహుమతి.. ఇంతకాలం నేను కలిసిన వ్యక్తులే. స్నేహితులు, ప్రత్యర్థులు, అభిమానులు ఆటకు జీవం పోశారు. మూడేళ్లుగా గాయాలు, సర్జరీలు సవాలుగా మారాయి. పూర్తి స్థాయి పోటీతత్వంతో ఆటలోకి తిరిగొద్దామనుకున్నా. కానీ నా శరీరం సామర్థ్యం, పరిమితులు నాకు తెలుసు. అది నాకు ఆలస్యంగా ఓ సందేశం పంపింది. 1500 మ్యాచ్‌ల కంటే ఎక్కువ ఆడా.
నా కల కంటే టెన్నిస్‌ నాకెంతో ఇచ్చింది. వచ్చే వారం లండన్‌లో ఆడే లేవర్‌ కప్‌ నా చివరి ఏటీపీ టోర్నీ. భవిష్యత్‌లో టెన్నిస్‌ ఆడతా కానీ గ్రాండ్‌స్లామ్‌ లేదా టూర్‌ టోర్నీల్లో పాల్గొనను. ఇదో
చేదు తీపి నిర్ణయం" అంటూ ట్వీట్ చేశాడు.

నంబర్ వన్ రికార్డు.. రెండుసార్లు కవలలు..ఫెదరర్ నంబర్ వన్ గా ఐదు సీజన్లు ముగించాడు. 2021 వింబుల్డన్‌లో చివరిసారి ఆడాడు. ఫెదరర్ భార్య పేరు మిర్కా. ఆమె కూడా టెన్నిక్ ప్లేయరే. చిత్రమేమంటే వీరికి నలుగురు పిల్లలు. రెండు సార్లు కవలలు పుట్టారు. ఇక ఫెదరర్ 103 టూర్‌ స్థాయి టైటిళ్లు, సింగిల్స్‌లో 1,251 మ్యాచ్‌లతో జిమ్మీ కానర్స్‌ తర్వాత ఓపెన్‌ శకంలో ఈ ఘనతలు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. కాగా, ఫెదరర్ కెరీర్ మొత్తంలో 30 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడాడు. 43 సార్లు సెమీస్ చేరాడు. 52 సార్లు క్వార్టర్స్ వరకు వచ్చాడు. మొత్తం 310 వారాలు నంబర్ వన్ గా ఉన్నాడు. దీనిని గతేడాదే జకోవిచ్ బీట్ చేశాడు. 2004లో తొలిసారి ప్రపంచ నంబర్ వన్ అయిన ఫెదరర్ 2008 వరకు దానిని నిలుపుకొన్నాడు. 2009,2012,2018 లో కూడా నంబర్ వన్ గా ఉన్నాడు. చిత్రమేమంటే.. 2018 లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మాత్రమే అతడు గెలిచిన చివరి గ్రాండ్ స్లామ్. అయినా అప్పటికి నంబర్ వన్ అయ్యాడు.కాగా, పురుషుల్లో, మహిళల్లో కలిపి వరుసగా అత్యధిక వారాలు (237) నంబర్‌వన్‌గా నిలిచిన ఘనత రోజర్‌దే. పెద్ద వయస్కుడైన (36 ఏళ్లు) నంబర్‌వన్‌ కూడా అతడే. వింబుల్డన్‌,యుఎస్‌ ఓపెన్‌ను నాలుగేళ్లు (2004-2007) వరుసగా గెలిచిన ఏకైక ఆటగాడు. ఫెదరర్‌ ఖాతాలో రెండు ఒలింపిక్స్‌ పతకాలు ఉన్నాయి. 2008 బీజింగ్‌లో డబుల్స్‌ స్వర్ణం గెలిచిన
అతడు.. 2012 లండన్‌ క్రీడల్లో సింగిల్స్‌ రజతం సాధించాడు.
Tags:    

Similar News