మంత్రి త‌ప్పుల‌పై తెలుగు ఐఏఎస్ ఫైట్‌

Update: 2018-04-12 06:54 GMT
నీతిగా ఉండాలి. న్యాయంగా వ్య‌వ‌హ‌రించాలి. త‌ర త‌మ భేదం లేకుండా వ్య‌వ‌హ‌రించాలి. నిబంధ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లే ప‌ని చేయాల‌నుకోవ‌టానికి మించిన పెద్ద త‌ల‌నొప్పి మ‌రొక‌టి ఉండ‌దు. అయితే. నిజాయితీగా వ్య‌వ‌హ‌రించే అధికారులు స‌హ‌జంగానే మొండిగా ఉంటారు. ఎవ‌రి మాట విన‌రు. ఇలాంటి వారు క‌ష్టాల్ని ప‌ట్టించుకోరు. పోరాటాన్నే ఆయుధంగా చేసుకొని ముందుకెళుతుంటారు.

క‌ర్ణాట‌క‌లో అలాంటి ప‌నే చేస్తున్నారు తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి. క‌ర్ణాట‌క మంత్రి మంజు త‌ప్పుల్ని ఎత్తి చూపారు. బాహుబ‌లి మ‌హామ‌స్తకాభిషేకాలు జ‌రిగిన సంద‌ర్భంగా మంత్రి తీరుపై హ‌స‌న్ జిల్లా క‌లెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న రోహిణి అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టం.. మంత్రి త‌ప్పుల్ని ఎత్తి చూప‌టంతో వారి మ‌ధ్య పోరాటం షురూ అయ్యింది.

ప‌వ‌ర్ తో రోహిణిని కంట్రోల్ చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ.. అలాంటి ప‌ప్పులు ఆమె ద‌గ్గ‌ర ఉడ‌క‌ని ప‌రిస్థితి. దీంతో.. రోహిణిపై ఏదో ర‌కంగా పైచేయి సాధించాలని మంత్రి త‌పిస్తున్నారు. ఇదే.. మ‌రిన్ని త‌ప్పులు చేసేలా చేస్తోంది. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన త‌ర్వాత బంజ‌రు భూముల‌కు సాగుప‌త్రాల్ని అందించిన వైనంపై ఎన్నిక‌ల క‌మిష‌న్ కు జిల్లా క‌లెక్ట‌ర్ హోదాలో ఉన్న రోహిణి లేఖ రాశారు. దీంతో.. మంత్రిపై ఎఫ్ ఐఆర్ న‌మోదైంది. దీన్ని ర‌ద్దు చేయాల్సిందిగా మంత్రి కోరారు.

ఈ అంశంపై స‌మాధానం ఇవ్వాల్సిన ప‌రిస్థితి రోహిణికి ఎదురైంది. ఈ సంద‌ర్భంగా ఆమె బ‌దులిస్తూ ఎన్నిక‌ల అధికారుల ఆత్మ‌స్థైర్యం దెబ్బ తినేలా మంత్రి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని రోహిణి పేర్కొన్నారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌చ్చాక మంత్రి చేప‌ట్టిన కార్య‌క్ర‌మాన్ని చూపెట్టి.. నిబంధ‌న‌ల్ని ఎలా ఉల్లంఘిస్తున్నారో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయినా.. ఎన్నిక‌ల వేళ ముక్కుసూటిగా వెళ్లే జిల్లా క‌లెక్ట‌ర్ తో పెట్టుకోవ‌టానికి మించిన బుద్ధి త‌క్కువ ప‌ని మ‌రొక‌టి ఉండ‌దు. ఆ చిన్న విష‌యాన్ని మంత్రి మంజు ఎందుకు గుర్తించ‌టం లేదు?
Tags:    

Similar News