భూమాకు గుండెపోటు...నెహ్రుకు వెన్నుపోటు

Update: 2017-06-30 05:49 GMT
అధికారానికి ఆశ‌ప‌డి పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేల‌కు టీడీపీ అధినేత‌ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు త‌న‌దైన శైలిలో గౌర‌వం ఇస్తున్నార‌ని వైఎస్సార్ కాంగ్రెస్ నేత - ఎమ్మెల్యే ఆర్‌ కె రోజా ఎద్దేవా చేశారు. చంద్రబాబును నమ్మి వైసీపీ నుండి తెలుగుదేశంలో చేరిన నేతల పరిస్థితి దయనీయంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అధికారం కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనతి కాలానికే గుండెపోటుకు గురి కాగా, జ్యోతుల నెహ్రూ వెన్నుపోటుకు గురయ్యారని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్‌ ఆర్‌ సీపీ జిల్లా స్థాయి ప్లీనరీకి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేల తీరు ద‌య‌నీయంగా ఉంద‌న్నారు.

మంత్రి పదవి ఆశ చూపి జ్యోతుల నెహ్రూను పార్టీలోకి లాగారని రోజా చెప్పారు. చంద్రబాబు విసిరిన బిస్కెట్లకు ఆశ పడి పార్టీ మారిన నెహ్రూ చివరకు వెన్నుపోటుకు గురయ్యారని ఎద్దేవా చేశారు. నెహ్రూ పరిస్థితి నేడు రెంటికి చెడ్డ రేవడి చందాన మారిందని వ్యాఖ్యానించారు. ఆయనకు చంద్రబాబు అపాయింట్‌మెంట్ కూడా దొరకడం లేదని, వైసీపీలో ఉంటే మంచి గౌరవం ఉండేదన్నారు. భూమా నాగిరెడ్డి కూడా మంత్రి పదవి కోసం నిరీక్షించి, చివరకు గుండెపోటుకు గురయ్యారన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపు తథ్యమని, అది వైసీపీ సీటేనని, అక్కడ తమకు కేడర్ బలంగా ఉందని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రజలకు అమలు కాని హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు దగాకోరు పాలనపై ప్రజలు పోరు సాగించాలని కోరారు. గత ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఆరు హామీలు కూడా నెరవేర్చలేదన్నారు. జిల్లాకు చెందిన హోంమంత్రి చినరాజప్ప చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారన్నారు. ఆయన ఒక్క పని కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు.

మంత్రి లోకేష్ ముద్దపప్పు అని, జయంతికి, వర్ధంతికి మధ్య తేడా తెలియని ఆయన రాజకీయాల్లో ఎలా రాణించగలరని రోజా ప్రశ్నించారు. ఫోన్‌ చేస్తే తాగునీరిస్తామని చెప్పిన మంత్రి లోకేష్‌ చాపరాయిపై స్పందించలేదు. ఆయనకు ఘటనే తెలియదా? అని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రులిద్దరూ అసమర్ధులని చినరాజప్ప, యనమల రామకృష్ణుడును ఉద్దేశించి రోజా విమ‌ర్శించారు. ఎన్నికల్లో గెలవలేని ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అవినీతి మంత్రిగా మారిపోయారని అన్నారు. చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌ గా ప్రకటించుకున్న జనసేన నాయకుడు పవన్‌ కళ్యాణ్‌ చేనేతపై జీజిఎస్‌ టి ప్రభావం పడుతుంటే ఏమయ్యారని రోజా ప్ర‌శ్నించారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. చంద్రబాబు అమలు కాని రుణమాఫీ హామీ ఇచ్చి గద్దె నెక్కారని, జగన్‌ అబద్దమాడలేక అధికారాన్ని వదులుకున్నారని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News