పవన్‌ కల్యాణ్‌పై రోజా వివాదాస్పద వ్యాఖ్యలు!

Update: 2022-11-08 07:30 GMT
ప్రతిపక్ష నేతలపై ఒంటి కాలిలో లేచేవారిలో వైఎస్సార్సీపీ నేతల్లో ఆర్కే రోజా ఒకరు. ఆ పార్టీ తరఫున ఫైర్‌బ్రాండ్‌గా ఉన్న రోజా పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కొంతవరకు విమర్శలు తగ్గించారు. మళ్లీ ఇప్పుడు ఓ రేంజులో ప్రతిపక్ష నేతలపై ధ్వజమెత్తుతున్నారు.

ముఖ్యంగా జనసేనాని పవన్‌ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌లపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తాజాగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఇటీవల కాలంలో రోజా ప్రముఖ దేవాలయాలన్నింటిని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలపై నిప్పలు చెరుగుతున్నారు. తాజాగా పవన్‌ కల్యాణ్‌ లక్ష్యంగా రోజా హాట్‌ కామెంట్స్‌ చేశారు.

రాష్ట్ర రాజకీయాల్లో పవన్‌ కల్యాణ్‌ ఓ కరివేపాకు అని ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరినీ కరివేపాకులా వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజమని తీవ్ర విమర్శలు చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు పచ్చ పత్రికలు, చానళ్లు ఎత్తుకున్నట్టే ఎత్తుకుని ఆయనను కిందపడేశాయని గుర్తు చేశారు. దీన్ని పవన్‌ కల్యాణ్‌ గుర్తు పెట్టుకోవాలన్నారు.

ఇప్పటం గ్రామం మంగళగిరి నియోజకవర్గంలో ఉందని రోజా గుర్తు చేశారు. అక్కడ ఏదైనా జరిగితే చంద్రబాబు కుమారుడు లోకేష్‌ వెళ్లకుండా పవన్‌ కల్యాణ్‌ను కరివేపాకులా చంద్రబాబు ముందుకు తోశారని రోజా హాట్‌ కామెంట్స్‌ చేశారు.

జనసేన అంటే సైకో సేనలా, రౌడీల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని రోజా మండిపడ్డారు. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

పరిపాలనా వికేంద్రీకరణ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా మూడు రాజధానుల ప్రతిపాదనకు కట్టుబడి ఉన్నారని రోజా చెప్పారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు దేవాలయాలకు వచ్చినప్పుడు రాజకీయ ప్రసంగాలు చేయడం ఏమిటని ఆమెపై విమర్శలు వస్తున్నాయి. తిరుమలలో సైతం కొండపైన ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నిబంధనలు ఉన్నా వాటిని ఆమె తోసిరాజని వ్యవహరిస్తున్నారని విమర్శలు రేగుతున్నాయి. అయినా రోజా లెక్కచేయడం లేదు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై రోజా తాజా వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News