రోజా మాట‌!..సీమ‌కు బాబు సారీ చెప్పాల్సిందే!

Update: 2017-08-18 11:16 GMT
నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో అక్క‌డి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్టేందుకు టీడీపీ అధినేత - సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారా? ఇప్ప‌టికే త‌న అధికార యంత్రాంగాన్ని - పోలీసుల‌ను నంద్యాల‌కు షిఫ్ట్ చేసేశారా?  ఏదో ఒక ర‌కంగా ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకొనేందుకు బాబు ప్ర‌య‌త్నిస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు  వైసీపీ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు - ఎమ్మెల్యే  ఆర్ కే రోజా. చంద్ర‌బాబుది అందితే జుట్టు.. అంద‌క‌పోతే.. కాళ్లు టైపు నైజ‌మ‌ని ఆమె ఫైర‌య్యారు. గ‌తం నుంచి కూడా బాబు అలాగే ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని అన్నారు. కాపు స‌మావేశం సంద‌ర్భంగా తునిలో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో సీమ రౌడీలు - సీమ గూండాలు ఉన్నార‌ని అప్ప‌ట్లో నోరు పారేసుకున్న చంద్ర‌బాబు .. ఇప్పుడు అదే సీమ ప్ర‌జ‌ల ఓట్లు అడిగేందుకు ఏ ముఖం పెట్టుకుని నంద్యాల వ‌స్తున్నార‌ని రోజా ప్ర‌శ్నించారు.

తుని ఘ‌ట‌న‌లో సీమకు చెందిన ఏ ఒక్క‌రికీ ప్ర‌మేయం లేద‌ని పోలీసులు నివేదిక స‌మ‌ర్పించార‌ని, అయినా కూడా బాబు త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుని సీమ యువ‌త‌కు - ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్ప‌లేద‌ని రోజా అన్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు బుద్ధి చెప్పాల‌ని ఆమె పిలుపునిచ్చారు. నంద్యాల‌లో మీడియాతో మాట్లాడిన రోజా.. బాబుపై నిప్పులు చెరిగారు. బాబు పాల‌న‌లో అవినీతి పెచ్చ‌రిల్లంద‌ని విమ‌ర్శించారు.  రెయిన్ గ‌న్స్‌ను అడ్డు పెట్టుకుని దాదాపు రూ.200 కోట్ల‌ను బాబు దోచేశార‌ని అన్నారు. ఒక్క ఎక‌రాకు కూడా రెయిన్ గ‌న్స్ ద్వారా చుక్క నీరు కూడా ఇవ్వ‌లేద‌ని ఆమె దుయ్య‌బ‌ట్టారు.

అదేవిధంగా క‌ర్నూలు ఆస్ప‌త్రిలో ఎలుక‌ల‌ను ప‌ట్ట‌డానికి అక్ష‌రాలా రూ.60 ల‌క్ష‌ల ప్ర‌జాధ‌నాన్ని త‌న టీడీపీ మందీ మ‌ర్బ‌లానికి క‌ట్ట‌బెట్టార‌ని అన్నారు. ఒక్కొక్క ఎలుక ప‌ట్ట‌డానికి రూ.20 వేల చొప్పున ఖ‌ర్చు పెట్టిన‌ట్టు నివేదిక ఇచ్చార‌ని, ఇలాంటి దోపిడీ ప్ర‌పంచంలో ఎక్క‌డైనా ఉంటుందా? అని రోజా ప్ర‌శ్నించారు. నంద్యాల‌లో జ‌గ‌న్ కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని బాబు చెబుతున్నార‌ని, ఆనాడు మామ నుంచి పార్టీ ని లాక్కోడానికి కుట్ర‌లు ప‌న్నింది ఎవ‌ర‌ని రోజా ప్ర‌శ్నించారు. కుట్ర‌ల‌కు పేటెంట్ ఉంటే అది బాబేన‌ని అన్నారు.  టీడీపీ నేత‌ల‌కు అధికారం ఇస్తే.. అధికారుల‌ను కొడ‌తార‌ని, అధికారుల‌ను తిడ‌తార‌ని పేర్కొంటూ.. విజ‌య‌వాడ‌లో ఎంపీ నాని ఉదంతాన్ని రోజా వివ‌రించారు.

నంద్యాల ప్ర‌జ‌లు  2004 నుంచి వైఎస్ కుటుంబానికి  అండ‌గా ఉంటున్నార‌ని రోజా చెప్పారు. ఇక్క‌డి ప్ర‌తి ఒక్క‌రి గుండెల్లోనూ వైఎస్ ఉన్నార‌ని, అందుకే ఇక్క‌డి వారికి వైసీపీ అంటే ప్ర‌త్యేక అభిమాన‌మ‌ని చెప్పారు. జ‌గ‌న్ ఎక్క‌డికి వెళ్తున్నా.. నంద్యాల ప్ర‌జ‌లు ఆయ‌న వెంట వేల సంఖ్య‌లో వ‌స్తున్నార‌ని, ఇప్పుడు ఈ ఉప ఎన్నిక‌లోనూ వైసీపీదే ఘ‌న విజ‌య‌మ‌ని రోజా పేర్కొన్నారు. ఇక‌, గెలుపు త‌న‌దేన‌ని చెప్పుకొంటున్న సీఎం చంద్ర‌బాబు రేప‌టి నుంచి నంద్యాల‌లో ప‌ర్య‌టించేందుకు ఎందుకు వ‌స్తున్నార‌ని, ఇప్పుడు గెలుపుపై ఆశ‌లు పోయాయా? అని ఎద్దేవా చేశారు.  నిఘా వ‌ర్గాల క‌థ‌నం ప్ర‌కారం  గెలుపు వైసీపీద‌ని తెలియడంతోనే ఈ ఎన్నిక‌ను వాయిదా వేసేందుకు బాబు అండ్ కోప్ర‌య‌త్నిస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.
Tags:    

Similar News