ఏపీ సీఎం జగన్ మరో చారిత్రక పథకాన్ని ప్రారంభించి సంచలనం సృష్టించాడు. పేద పిల్లల తల్లులకు సంవత్సరానికి 12వేలు అందించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ‘అమ్మఒడి’ పథకాన్ని సీఎం జగన్ చిత్తూరు జిల్లాలో ఈరోజు ప్రారంభించారు. ఈ సభలో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే రోజా గత చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు.
రోజా మాట్లాడుతూ పేదల పిల్లల చదువుల కోసం అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన చరిత్రకారుడు సీఎం వైఎస్ జగన్ అయితే.. పేదల చదువును కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు బలిచేసిన చరిత్రహీనుడు చంద్రబాబు అని రోజా ధ్వజమెత్తారు.
ఇక పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చిన చరిత్రకారుడు వైఎస్ జగన్ అయితే.. పేదలు చదివే 6వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసిన చరిత్రహీనుడు చంద్రబాబు అని రోజా సంచలన పంచులతో హోరెత్తించారు.
ఇక మధ్యాహ్న భోజనంలో పేదలకు పౌష్టికాహారం అందించిన చరిత్రకారుడు జగన్ అయితే.. ఆ పేద పిల్లలు తినే కోడిగుడ్లను కూడా మింగేసిన చరిత్రహీనుడు చంద్రబాబు అని రోజా పంచుల వర్షం కురిపించారు. 45వేల ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి జగన్ చరిత్ర లో నిలిస్తే.. తను చదివిన పాఠశాలలను కూడా అభివృద్ధి చేయలేని చేతకాని వాడు బాబు అని రోజా దుయ్యబట్టారు.గత ముఖ్యమంత్రులు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలు సొంత జిల్లా చిత్తూరుకు చేసిందేమీ లేదని రోజా విమర్శించారు.
ఇలా చరిత్రకారుడు జగన్ , చరిత్రహీనుడు చంద్రబాబు అంటూ రోజా సభలో కురిపించిన పంచుల వర్షానికి వేదిక మీద ఉన్న సీఎం జగన్, మంత్రులు, నేతలు, కింద ఉన్న జనాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.