జూ.ఎన్టీఆర్ ను గిల్లుతున్న రోజా

Update: 2016-03-29 11:39 GMT
ఏపీ శాసనసభలో ఏడాది సస్పెండై రికార్డులకెక్కిన వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆ విషయంలో టీడీపీ ప్రభుత్వంతో ఫైటింగ్ కు సిద్ధమయ్యారు. సుప్రీంకోర్టులో కేసు వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆమె చంద్రబాబును తాను విమర్శించడమే కాకుండా మరికొందరిని కూడా చంద్రబాబుపై ఉసిగొల్పే ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా హరికృష్ణ కుమారుడు, హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను ఉసిగొల్పేలా మాట్లాడారు. అక్కడితో ఆగకుండా పెద్ద ఎన్టీఆర్ ప్రస్తావనా తీసుకొచ్చారు. ఎన్టీఆర్ ను ప్రజలు గుర్తుంచుకోవడం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదని.. ఆకోపంతోనే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా ఆడనివ్వకుండా చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదల కానివ్వకుండా, ఆడనివ్వకుండా ఇనుప పాదంతో తొక్కేస్తున్నారని రోజా మండిపడ్డారు. జూనియర్  ఎన్టీఆర్‌ను ఎన్నికల సమయంలో ప్రచారానికి వాడుకుని, ఆ తర్వాత టీడీపీలో కార్యకర్తగా కూడా ఉండనివ్వకుండా తరిమేశారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు తన కొడుకు లోకేశ్  ఎదగలేడన్న భయంతో ఎన్టీఆర్‌ను తొక్కేశారని విమర్శించారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలన్నింటికీ చంద్రబాబు తూట్లు పొడిచారని ఆమె అన్నారు. అలాంటి వాళ్లకు టీడీపీ జెండా ఎగరేసే హక్కుందా అని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ సమైక్యాంధ్రకు కట్టుబడి, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడితే, చంద్రబాబు మాత్రం కాంగ్రెస్‌తో జతకలిసి రాష్ట్రాన్ని విడదీశారని చెప్పారు. ఎన్టీఆర్ సంపూర్ణ మద్యనిషేధం విధిస్తే, చంద్రబాబు మాత్రం బెల్టుషాపులతో మద్యాన్ని పొంగిస్తూ ఆడపడుచుల జీవితాలు నాశనం చేస్తున్నారన్నారు. ఎన్టీఆర్ మీద బాబుకు ఎంత కక్ష ఉందో స్పష్టంగా తెలుస్తుందంటూ పలు విషయాలు వివరించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో మంచినీళ్లను చవగ్గా అందిస్తామన్నారని, కానీ అవి రాష్ట్రంలో నాలుగైదు చోట్ల కూడా లేవని చెప్పారు. అన్న క్యాంటీన్లు అంటూ ఆర్భాటంగా ప్రకటించి రెండేళ్లయినా.. ఇప్పటికీ ఒక్కటీ పెట్టలేదన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్యసేవ అని పేరు మార్చారని.. కానీ గత సంవత్సరం 350 కోట్లు, ఈ సంవత్సరం 450 కోట్ల బకాయిలతో ఆ పథకానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరుమీద ఉన్న పథకాలన్నింటినీ నిర్వీర్యం చేశారని, అదే తన పేరు మీద ఉన్న చంద్రన్న కానుకకకు మాత్రం అడ్డదిడ్డంగా నిధులిస్తూ అందులో అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు చేశారు.  ఎన్టీఆర్ టైంలో ఉన్నదే తెలుగుదేశం పార్టీ అని... ఇప్పుడు చంద్రబాబు పార్టీ తెలుగు దొంగల పార్టీ అని విమర్శించారు. అప్పట్లో ఎన్టీఆర్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు ఇప్పుడు తనను టార్గెట్ చేసి కక్షగట్టారని ఆరోపించారు.
Tags:    

Similar News