రోజా గ‌తం బ‌య‌ట‌పెట్టిన సునీత‌మ్మ

Update: 2015-09-02 16:45 GMT
ఏపీ అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఫ్రేమ్‌ లో క‌నిపించే వారు కొంద‌రే ఉంటున్నారు. అందులో సీఎం హోదాలో ఉన్న చంద్ర‌బాబునాయుడు, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ అయితే మ‌రో ముగ్గురు న‌లుగురే అసెంబ్లీలో కీల‌కంగా క‌నిపిస్తున్నారు. వారిలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యే రోజా ఒక‌రు. అవ‌కాశం దొరిక‌న‌పుడ‌ల్లా తెలుగుదేశం పార్టీపై, ఆ పార్టీ అధినేత‌ చంద్ర‌బాబుపై  రోజా విరుచుకుప‌డుతుంటారు. దానికి అధికార టీడీపీ మంత్రులు, స‌భ్యులు కౌంటర్ ఇస్తుంటారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా స‌భ‌లో రోజా మాట్లాడుతూ దివంగ‌త టీడీపీ నేత ప‌రిటాల ర‌వి కుమారుడు ప‌రిటాల శ్రీ‌రాంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. శ్రీ‌రాం త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను హత్య చేస్తున్నార‌ని, ఇందులో ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీకి చెందిన వారున్నార‌ని ఆరోపించారు. అధికార తెలుగుదేశం పార్టీ ప్రోద్బ‌లంతోనే ఆ చ‌ర్య‌లు సాగుతున్నాయని దుయ్య‌బ‌ట్టారు. ఈ క్ర‌మంలోనే ప‌రిటాల ర‌వి సతీమ‌ణి, రాష్ర్ట మంత్రి అయిన ప‌రిటాల సునీత మైక్ తీసుకొని రోజాపై విరుచుకుప‌డ్డారు.

రోజా తెలుగుదేశం పార్టీలో ఉండ‌గా ఏం మాట్లాడారో గుర్తుకుతెచ్చుకోవాల‌ని సునీత చెప్పారు. టీడీపీ నాయ‌కురాలిగా ఉన్న‌పుడు రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టిస్తూ..ప‌రిటాల ర‌వి బొమ్మ‌కు దండ‌వేసి నివాళులు అర్పించార‌ని చెప్పారు. ఇదే క్ర‌మంలో అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డే ప‌రిటాల ర‌విని చంపించార‌ని ఆరోపించార‌ని...ఆ విష‌యం ఇపుడు రోజా మ‌రిచిపోయారా అంటూ ప్ర‌శ్నించారు. టీడీపీలో ఉన్న‌పుడు ఒక‌మాట‌...ఇపుడు ఒక మాట మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. రోజా చేసే విమ‌ర్శ‌ల్లో వాస్త‌వం ఉంటే...ఆధారాలు బ‌య‌ట‌పెట్టాల‌ని డిమాండ్ చేశారు. నాయ‌కులు విశ్వ‌స‌నీయ‌త కాపాడుకునేలా మాట్లాడాల‌ని సూచించారు.
Tags:    

Similar News