కంచె ఐల‌య్య కోసం ఓవైసీ తాప‌త్ర‌యం

Update: 2017-09-11 17:06 GMT
ఆర్య వైశ్యుల‌పై కంచ ఐల‌య్య రాసిన పుస్త‌కం వివాదాస్ప‌ద‌మైన సంగ‌తి తెలిసిందే.  సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు అన్న పుస్త‌కాన్ని ఐల‌య్య రాశారు. పుస్తకం టైటిల్‌తో పాటు అందులో ఉన్న కొన్ని అంశాలు త‌మ వ‌ర్గం ప‌ట్ల అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని వైశ్యులు ఆరోపిస్తున్నారు. మ‌రోవైపు కంచె ఐల‌య్య‌కు బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయని ఉస్మానియా వ‌ర్సిటీ పోలీస్ స్టేష‌న్‌లో ఇవాళ ఫిర్యాదు చేశారు. త‌న ప్రాణానికి ఏమైనా హాని జ‌రిగి అంత‌ర్జాతీయ ఆర్య వైశ్య సంఘందే బాధ్య‌త అని త‌న ఫిర్యాదులో ప్రొఫెస‌ర్ ఐల‌య్య పేర్కొన్నారు. ఇలా ఐల‌య్య వ‌ర్సెస్ వైశ్యుల మ‌ధ్య మాట‌ల‌యుద్ధం సాగుతోంది.

అయితే ఈ ఎపిసోడ్‌ పై ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ఏ రాజ‌కీయ పార్టీ స్పందించ‌న‌ప్ప‌టికీ ఎంఐఎం ర‌థ‌సార‌థి, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ రియాక్ట‌య్యారు. ఐల‌య్య‌కు అండ‌గా నిలిచారు అదే స‌మ‌యంలో స‌ర్కారుకు డిమాండ్ చేశారు. ర‌చ‌యిత డాక్ట‌ర్ కంచ ఐల‌య్య‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కోరారు. త‌క్ష‌ణ‌మే ఆయ‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించి, ఆయ‌న్ను బెద‌రిస్తున్న వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇవాళ ఎంపీ ఓవైసీ డిమాండ్ చేశారు. త‌న‌కు బెదిరింపు కాల్స్ వ‌స్తున్న‌ట్లు ఐల‌య్య త‌న ఫిర్యాదులో పేర్కొన్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఓవైసీ కోరారు. కంచె ఐలయ్య వైశ్యులను కించపరినట్లు తెలిసింది.

మ‌రోవైపు తమిళనాడు మాజీ గవర్నర్, ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం రోశయ్య ఆస‌క్తికరంగా స్పందించారు. రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు సహజమ‌ని ఎవరి అభిప్రాయం వారిదని పేర్కొన్నారు. అభిప్రాయాలు ఒక్కటిగా లేనంత మాత్రాన విరోధిగా - శతృవుగా చూడాల్సిన పనిలేదని అన్నారు. మన అభిప్రాయాలతో ఏకీభవించని వారితో కూడా కొన్నిసార్లు సర్దుకుపోవాలని రోశ‌య్య సూచించారు. ఎవరూ ఎవర్నీ కించపరచాల్సిన అవసరం లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. వైశ్యులు కంచె ఐలయ్యతో కలిసి, కూర్చుని, చర్చించుకోవాలని సూచించారు. అభిప్రాయ భేధాలను పరిష్కరించుకునేందుకు సర్దుబాటు చేసుకోవాలని రోశ‌య్య కోరారు.
Tags:    

Similar News