ఏపీ పాలిటిక్సుపై రోశయ్య కన్ను

Update: 2016-04-30 11:24 GMT
సమైక్య ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, ప్రస్తుత తమిళనాడు గవర్నరు రోశయ్య తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులపై స్పందించారు.  ఈ సంద‌ర్భంగా ఆయన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంసారం సాగుతోందని.. క్రమంగా అన్నీ చక్కబడతాయని అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రోశ‌య్య‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర‌ విభజన త‌రువాత ఏపీలో ఎన్నో మార్పులు వ‌చ్చాయ‌న్నారు. రాష్ట్ర ప‌రిస్థితులు త్వ‌ర‌లోనే స‌ర్దుకుంటాయ‌ని, కొత్త సంసారం పెట్టినప్పుడు మ‌నిషి చేసుకునే ఏర్పాట్ల‌లా ప్ర‌స్తుతం ఏపీలో ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు. అన్ని పనులు క్రమంగా పూర్తవుతాయని వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాలు మ‌రింత‌ అభివృద్ధి చెందుతాయ‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

కోస్తా ప్రాంత  ప్రజలకు రాజకీయాల‌పై అవ‌గాహ‌న ఎక్కువేన‌ని రోశయ్య కితాబిచ్చారు. అందుకే, కోస్తా ప్రజలను త‌మ‌వైపుకు తిప్పుకోవ‌డానికి రాజ‌కీయ‌పార్టీలు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.  ఇక్కడి వారి ఆదరణ, అభిమానం పొందేందుకు పార్టీలు అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నాయని తెలిపారు.

అయితే, ఇది మోతాదు మించకుండా చూసుకోవాలని రోశయ్య సూచించారు. ఆయన మాటలను చూస్తుంటే ఏపీలో రాజకీయాలను చాలా నిశితంగా గమనిస్తున్నట్లే కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి.. ఎవరిపై కన్నేశాయి వంటివన్నీ పక్క రాష్ట్రంలో ఉంటూనే ఈ అనుభవశాలి గమనిస్తున్నారంటే చిన్న విషయమేమీ కాదు. గవర్నరు గిరీ పూర్తయిన తరువాత రోశయ్య గారు మరి రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.
Tags:    

Similar News