తనను యావరేజ్ గా ఒప్పుకున్న మాజీ సీఎం

Update: 2016-09-19 09:38 GMT
తెలుగు రాజకీయాల్లో హుందాతో కూడిన రాజకీయ నేతలు ఎంతమంది అంటే వెళ్ల మీద లెక్కపెట్టి చెప్పేయొచ్చు. దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్నా.. వివాదాలకు దూరంగా ఉండే అగ్రనేతలు చాలా కొద్దిమందేనని చెప్పకతప్పదు. ఇప్పుడున్న దూకుడు రాజకీయాల్లో అజాత శత్రువు అన్న మాటను అనిపించుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గొప్పలు చెప్పుకోకుండా.. తన గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకునే తత్వం ఉన్న నేతలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. తెలుగు రాజకీయాలో కురువృద్ధుడు.. విలువలతో కూడిన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య.

తన తీరుతో మోడీ సర్కారు హయాంలో గవర్నర్ గా కొనసాగిన అతి కొద్దిమంది కాంగ్రెస్ సీనియర్ నేతల్లో  రోశయ్య ఒకరిగా చెప్పక తప్పదు. ఇటీవలే తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతల్ని పూర్తి చేసుకున్న ఆయన.. ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాన్ని ఓపెన్ గానే చెప్పేయటం కనిపిస్తుంది. తాను ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అంశానికి బదులిస్తూ.. తనను తాను యావరేజ్ సీఎంగా అభివర్ణించుకోవటం కనిపిస్తుంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోని ఆర్థిక పరిస్థితులు.. తెలంగాణ ఉద్యమ పరిస్థితులు.. పరిణామాల్ని తనకు చేతనైనట్లుగా ఎదుర్కొన్నట్లుగా రోశయ్య చెప్పారు.

అందుకే తనను తాను ఒక యావరేజ్ ముఖ్యమంత్రిగానే భావిస్తానని చెప్పారు. పదవులు ఉంటే విర్రవీగటం.. పదవులు లేకపోతే విచారపడటం లాంటివి తన రాజకీయ జీవితంలో తెలీదన్నారు. ఇప్పుడున్న నేతల్లో ఎవరిని కదిలించినా.. తాముచేసిన పనులను గొప్పగా చెప్పుకోవటం.. చరిత్రలో తాము తప్పించి మరెవరూ చేయలేదన్నట్లుగా గొప్పలు చెప్పుకునే ఈ రోజుల్లో.. తనను తాను యావరేజ్ చెప్పుకోవటం రోశయ్య లాంటోళ్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుందేమో? అలా మాట్లాడేందుకు ఇప్పటి నేతలకు దమ్ము.. ధైర్యం లేదనే చెప్పక తప్పదు.
Tags:    

Similar News