2012 లో స్టార్ట్ అప్.. ఇప్పుడు లక్ష కోట్లంట!

Update: 2021-11-11 05:30 GMT
షేర్ మార్కెట్ గురించి అవగాహన ఉన్న వారికి.. దాన్నో అలవాటుగా మార్చుకున్న వారికి మాత్రమే కాదు.. మార్కెట్ గురించి అంతగా అవగాహన లేని వారికి సైతం ‘నైనా’ సంస్థ పేరు తెలిసేలా చోటు చేసుకుంది. బీఎస్ఈలో లిస్టైన తొలిరోజునే హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అనూహ్య రీతిలో దూసుకెళ్లిన ఈ షేరు ఇప్పుడు అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. బీఎస్ఈలో లిస్టు అయిన మొదటి రోజునే రూ.1125 ధరతో ప్రారంభమై మొదటి రోజునే 80 శాతం ప్రీమియంతో రూ.2018 వద్ద లిస్టు కావటం ఒక ఎత్తు అయితే.. అమ్మకాల ఒత్తిడిలో ట్రేడ్ అవుతున్నప్పటికీ.. ఈ షేరుకు ఏ మాత్రం డిమాండ్ తగ్గకపోవటం ఒక విశేషంగా చెప్పాలి.

ఒక దశలో 100 శాతం దూసుకెళ్లి రూ.2248 గరిష్ఠ స్థాయిని చేరుకుంది. చివర్లో మాత్రం 96 శాతం లాభంతో రూ.2206తో ట్రేడింగ్ ను ముగించింది. దీంతో.. ఈ నైకా ఏంటి? అసలీ కంపనీ ఏం చేస్తుంది? మార్కెట్లో దీనికి ఎందుకింత క్రేజ్ అన్నదిప్పుడు అందరిలోనూ ప్రశ్నలు రేపుతున్నాయి. మార్కెట్లో లిస్టు అయిన మొదటిరోజునే మొత్తం 3.43 కోట్ల షేర్లు చేతులు మారాయి. అంతేనా.. మార్కెట్ ముగిసేసరికి కంపెనీ మార్కెట్ విలువ రూ.1.04 లక్షల కోట్లుగా నిలిచింది.

దేశీయ ఎక్సైంజ్ లో లిస్ట్ అయిన కంపెనీల్లో 55వ స్థానాన్ని సొంతం చేసుకున్న ఈ సంస్థ మరోరికార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ కామర్స్ విభాగంలో ఈ స్థాయిలో లాభాల్ని తీసుకొన్న తొలి కంపెనీగా దీన్ని చెప్పాలి. ఇంతకూ ఈ కంపెనీ చేసేదేమిటి? ఏమేం ఉత్పత్తి చేస్తుంది? ఎలాంటి సేవల్ని అందిస్తుందన్నది చూస్తే.. ఈ కంపెనీ ఎలాంటి ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేయదు. రోజువారీగా మహిళలుఉపయోగించే లిప్ స్టిక్.. లిప్ జెల్ మొదలు సౌందర్య..సంరక్షణ ఉత్పత్తుల్ని అమ్మే ప్లాట్ ఫాంగా దీన్ని చెప్పాలి. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే మనకు బాగా తెలిసిన అమెజాన్.. ఫ్లిప్ క్టార్ లాంటి సేవల్ని అందిస్తుందని చెబితే కాస్త దగ్గరగా ఉంటుంది.

ఇతర కంపెనీలు తయారు చేసే ఉత్పత్తుల్ని తమ పోర్టల్ ద్వారా అమ్మకాల్ని అందించే నైకా.. మార్కెట్లో అడుగు పెట్టిన రోజే హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అందరి చూపు దాని మీద పడేలా చేసింది. ఈ కంపెనీ వ్యవస్థాపకురాలు ఫల్గుణీ నాయర్ కుటుంబం సంపద ఒక్కరోజులో భారీగా పెరిగిపోయింది. ఈ కంపెనీ ప్రమోటర్ కుటుంబానికి 54.22 శాతం వాటాలు ఉన్నాయి. మార్కెట్లో లిస్టు అయిన మొదటి రోజునే ఈ షేరు తారాజువ్వలా దూసుకెళ్లిపోవటంతో మొదటి రోజు ముగిసేనాటిని ఫల్గుణి నాయర్ వద్ద ఉన్న షేర్ల విలువ ఏకంగా రూ.55,900 కోట్లకు చేరుకోవటం గమనార్హం.
Tags:    

Similar News