తెలంగాణ అమరవీరులకు రూ.10 లక్షలు.. 'రైల్వే' మృతుడికి రూ.25 లక్షలా?

Update: 2022-06-18 12:30 GMT
తెలంగాణ రాష్ట్రం కోసం కలలు కని.. ఆ కలను సాకారం చేసుకోవటం కోసం ఎవరినో నిందించటం మాని.. తనను తాను ఆత్మాహుతి చేసుకున్న తెలంగాణ అమరవీరులెందరో. ఉద్యమ సమయంలో వీరి సంఖ్యను 1500 మందికి పైనే చెప్పేవారు. చివరకు టీఆర్ఎస్ పార్టీ.. పొలిటికల్ జేఏసీలు నాటి శ్రీకృష్ణ కమిటీకి రిపోర్టు ఇచ్చినప్పుడు 1381 మంది ఆత్మాహుతి చేసుకున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత 1089 మంది అమరులు ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా చనిపోయారో పేర్కొంటూ పూర్తి వివరాలతో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సైతం ఒక నివేదికను తయారు చేసింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడిన కేసీఆర్ సర్కారు మాత్రం  తెలంగాణ అమరవీరులుగా 576 మందికి మాత్రమే ప్రభుత్వం సాయం ఇవ్వటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎనిమిదేళ్లు దాటినా.. తెలంగాణ రాష్ట్ర అవతరణలో కీలకభూమిక పోషించిన అమరవీరుల యాదికి నిర్మిస్తున్నఅమరుల స్మారక చిహ్నం మాత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉండటం గమనార్హం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని గతంలో ప్రకటించారు కేసీఆర్. పరిహారంతో పాటు వీరి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం.. సాగుభూమి.. ఇల్లు.. ఎడ్యుకేషన్.. హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఇందులో ఉద్యోగం మాత్రమే ఇచ్చారు. అది కూడా 12 మందికి వీఆర్ వో స్థాయి ఉద్యోగాలు ఇస్తే.. మిగిలిన వారికి జూనియర్ అసిస్టెంట్.. స్వీపర్.. వాచ్ మెన్.. అటెండర్ లాంటి ఉద్యోగాలే ఇచ్చారు. అంతే మొత్తంలో సగానికి కంటే తక్కువ మందికి మాత్రమే పరిహారం అందిన పరిస్థితి.

తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ సర్కారు చేసింది ఇదైతే.. తాజాగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ మీద ఆగ్రహంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భీతవాహ పరిస్థితికి కారణమైన ఆందోళనకారులపై రైల్వే పోలీసులు కాల్పులు జరపటం.. ఇందులో ఒకరు మరణించటం.. పలువురు గాయపడటం తెలిసిందే. మరణించిన వ్యక్తిని రాకేశ్ గా గుర్తించారు. ఘటన జరిగిన శుక్రవారం పొద్దుపోయిన తర్వాత సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేశారు.

రైల్వేస్టేషన్ లో భయానక వాతావరణాన్ని సృష్టించిన ఆందోళకారులపై రైల్వే పోలీసులు కాల్పులు జరపగా.. మరణించిన రాకేశ్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు.. రాకేశ్ మరణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని తెలియజేశారు.

తెలంగాణ కోసం ప్రాణాలు ఆర్పించిన అమరవీరుడికి రూ.10 లక్షలు ఇచ్చిన కేసీఆర్ సర్కారు.. తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దాడికి పాల్పడి.. రైల్వే పోలీసుల కాల్పుల్లో మరణించిన వ్యక్తికి రూ.25 లక్షల పరిహారాన్ని ప్రకటించటమా? అన్నదిప్పుడు పెద్ద చర్చగా మారింది.
Tags:    

Similar News