రూ.2.30లక్షల కోట్ల బడ్జెట్ సరే.. డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారు?

Update: 2021-03-19 09:30 GMT
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కనీసం ఆలోచించటానికి కూడా ఇష్టపడని బడ్జెట్ అంకె.. ఇప్పుడు ఒక్క తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ గా మారింది. అంతదాకా ఎందుకు.. గత ఏడాదితో పోలిస్తే.. ఏకంగా రూ.48వేల కోట్లు అదనంగా బడ్జెట్ ప్రతిపాదనలే ఆసక్తికరంగా మారాయి. బడ్జెట్ లో భారీతనం చూసి వావ్ అనాలో.. భారీతనం వెనుకున్న లెక్కలకు భయపడాలో అర్థం కాని పరిస్థితి. జేబులో రూపాయి ఉంటే.. ఐదురూపాయిలు ఖర్చులకు ప్లాన్ చేస్తే ఎలా ఉంటుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ను సింఫుల్ గా.. చిన్న మాటలో తేల్చేయాలంటే ఈ ఉదాహరణ సరిపోతుంది.

గత సంవత్సరం ప్రవేశ పెట్టిన బడ్జెట్ రూ.1.82లక్షల కోట్లు కాగా.. తాజాగా ప్రవేశ పెట్టింది రూ.2.30లక్షల కోట్లు. వాస్తవానికి ఈసారి బడ్జెట్ రూ.2లక్షల కోట్ల అంకెను దాటుతుందనే అనుకున్నారు కానీ.. ఏకంగా రూ.30వేల కోట్లు అదనంగా ఉంటుందని ఎవరూ ఊహించలేకపోయారు. భారీగా బడ్జెట్ ప్రతిపాదనలు పెట్టేసినా.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎప్పుడూ వచ్చేంతే ఉంటుంది. లేదంటే.. మరికాస్త ఎక్కువగా ఉంటుంది. అంతే తప్పించి.. భారీగా పెరిగే అవకాశమే లేదు.

ఇప్పుడిప్పుడు సర్దుకుంటుందని భావించిన కరోనా కేసులు.. గడిచిన వారం.. పది రోజులుగా పెరగటం చూసినప్పుడు.. రానున్న రోజుల్లో కేసుల తీవ్రత మరింత పెరగటం ఖాయమని చెప్పక తప్పదు. ఇలాంటప్పుడు ప్రభుత్వం ఆశిస్తున్న ఆదాయం వస్తుందా? అన్నది సందేహమే. అలాంటప్పుడు భారీ బడ్జెట్ ప్రతిపాదనలకు రీచ్ కావటం ఎలా? అన్నది మరో ప్రశ్న. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభంలో ఇంతటి భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఓకే చెప్పిన కేసీఆర్ సర్కారు ధైర్యాన్ని మెచ్చుకోవల్సిందే.

ఇంతకీ.. రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి.. కేంద్రం నుంచి వచ్చే పన్ను వాటాతో పోలిస్తే.. ఆ అంకెలకు.. బడ్జెట్ లో పెట్టిన రూ.2.30లక్షల కోట్లకుఏ మాత్రం సరిపోయినట్లుగా కనిపించదు. మరెలా? అంటే.. అక్కడేఉంది అసలు మేజిక్ అంతా. అయితే.. అప్పులు చేయటం.. లేదంటే పెద్ద ఎత్తున భూములు అమ్మేయటం లాంటి అస్త్రాల్ని సిద్ధం చేసుకున్నసర్కారు.. భారీ బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైందని చెప్పాలి. అదిరేలా అంచనాలు ఉన్నప్పటికీ.. వాస్తవంలో అవన్నీవర్కువుట్ అవుతాయా? అన్నదే అసలు ప్రశ్న.
Tags:    

Similar News