ఆ రాష్ట్రాల వారికి రూ.3లక్షల సాయం కేసీఆర్ కు వరమా? శాపమా?

Update: 2021-11-21 08:35 GMT
చేతిలో ఉన్న సొమ్మును ఖర్చు చేయటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. మంది సొమ్మును ఎంచక్కా ఖర్చు చేయటానికి మించిన సులువైన పని మరొకటి ఉండదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట్నించి.. తాను అనుకున్నదే తడువుగా.. వెనుకా ముందు ఆలోచించకుండా సాయాన్ని ప్రకటించటంలో ఆయనకు ఆయనే సాటిగా చెప్పాలి. ప్రభుత్వాల నుంచి సాయం అందాలంటే పోరాటాలు చేయాలి.. నిరసనలు చేయాలి. కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం అలాంటి వాటికి అస్సలు అవకాశం ఇవ్వరు.

మనసుల్ని దోచుకునే అవకాశం ఉన్న అంశం ఏదైనా సరే.. ఎంత సాయానికి అయినా వెనుకాడకుండా ఇచ్చే మనస్తత్వం ఆయన సొంతం. తాజాగా తాము తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తామంటూ ప్రధాని మోడీ స్వయంగా వెల్లడించి.. ఈ చట్టాల్ని తీసుకొచ్చినందుకు జాతి జనులందరికి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం దేశ ప్రజల్ని విస్మయానికి గురి చేయటమే కాదు.. ఆయన ఆలోచన వెనుక అసలు విషయం ఏమిటన్న విషయాన్ని మాత్రం ఒక పట్టాన తేల్చుకోలేకపోతున్నారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజా పరిణామాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వచ్చారు. వ్యవసాయ చట్టాల రద్దుకోసం ఉద్యమించి.. ఆ ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3లక్షల సాయాన్ని అందిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన విన్నంతనే కేసీఆర్ రాజకీయ చతురతకు ముచ్చటపడకుండా ఉండలేం. ఏం కొట్టారండి దెబ్బ అన్న భావన కలగటం ఖాయం. మరి.. ఈ ప్రకటన ఆయనకు మేలు చేస్తుందా? కొత్త తలనొప్పిని తీసుకొస్తుందా?

ఆయన ప్రకటన వరమా? శాపమా? అన్నదిప్పుడు చర్చగా మారింది. కలిసి వచ్చే కాలంలో ఏం చేసినా అదంతా మైలేజీగా మారుతుంది. కానీ.. కాలం కలిసి రాని వేళలో మాత్రం తాడు సైతం పాములా మారుతుంది. కేసీఆర్ రూ.3లక్షల సాయం ప్రకటన వెనుకున్న లక్ష్యం తెలంగాణ ప్రజలకు అర్థం కానిదంటూ ఏమీ ఉండదు. కాకుంటే.. ఆయన ప్రకటన సానుకూలంగా మారే కన్నా ప్రతికూలంగా మారే ప్రమాదమే ఉందన్న మాట వినిపిస్తోంది.

ఎందుకంటే.. వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలంటూ మోడీ సర్కారు మీద పోరాడి.. అందులో మరణించిన కుటుంబాలకు సాయం చేయటానికి ముందుకు వచ్చిన కేసీఆర్.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ప్రాణాల్ని అర్పించిన కుటుంబాలకు పూర్తిస్థాయిలో సాయం అందలేదన్న విమర్శ అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి వారు తమ గొంతు విప్పే అవకాశం ఉంది. అదే జరిగితే.. రూ.3లక్షల చొప్పున మైలేజీ సొంతం చేసుకోవాలన్న కేసీఆర్ ప్లాన్ కు కొత్త తలనొప్పులు ఖాయమని చెబుతున్నారు. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే తెలంగాణలో.. ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. కేసీఆర్ ఆత్మరక్షణలో పడటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.




Tags:    

Similar News