మోడీ తీసుకున్న పెద్ద నోట్ట రద్దు నిర్ణయం బ్యాంకు ఖజానాలను నింపేసింది. ప్రజలు, నల్ల కుబేరులు తమ వద్ద ఉన్న పాత నోట్లను తెచ్చి డిపాజిట్లు చేస్తుండడంతో భారీ మొత్తాలు డిపాజిట్లయ్యాయి. అందులో కొంత విత్ డ్రా అయినప్పటికీ విత్ డ్రాయల్ లిమిట్సు కఠినంగా ఉండడంతో జమ అయిన మొత్తంతో పోల్చితే అది చాలా తక్కువే.
ఈ నెల 8 నాటి నోట్ల రద్దు ప్రకటన తరువాత జరిగిన ఖాతాదారుల లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 10 నుంచి 18 వరకు రూ.5 లక్షల కోట్లకు పైగా పాత నోట్లు డిపాజిట్ అయ్యాయని వెల్లడించింది. ఇందులో రూ.5,11,565 కోట్లను బ్యాంకుల్లో జమచేశారని, మరో రూ.33,006 కోట్ల నగదు మార్పిడి జరిగిందని తెలిపింది. ఏటీఎంలు - బ్యాంకుల నుంచి ప్రజలు మొత్తం రూ.1,03,316 కోట్లు విత్ డ్రా చేసుకున్నారని చెప్పింది.
5 లక్షల కోట్ల డిపాజిట్లలో లక్ష కోట్లు మళ్లీ వెనక్కు తీసుకున్నా కూడా ఇంకా 4 లక్షల కోట్లు బ్యాంకుల్లోనే ఉన్నాయి. ఈ లెక్కన నోట్ల మార్పిడి గడువు డిసెంబరు 30 నాటికి 15 లక్షల కోట్లు డిపాజిట్ కావచ్చని అంచనావేస్తున్నారు.