సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం

Update: 2021-12-11 10:35 GMT
చిన్న వయసులోనే.. దేశ సేవ కోసం సైన్యంలో చేరి.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ ను మెప్పించి ఆయనతో పాటే హెలికాప్టర్ దుర్ఘటనలో అమరుడైన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా నిలువనుంది. అతడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది.

దీనిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారమే అధికారులతో చర్చించినట్లు సమాచారం. ఇదే సమయంలో ఓ సైనికుడి మరణానికి వెలకట్టామనే భావన రాకూడదని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. కష్టంలో ఉన్నప్పుడు ఇంత ఆర్థిక సాయం చేస్తున్నామంటూ హడావుడి చేయొద్దన్న సీఎం.. దీనిపై మీడియాలో ఎలాంటి ప్రచారానికి ఆస్కారం ఇవ్వొద్దని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.

ఆ కుటుంబాన్ని నేరుగా కలవాలన్న ముఖ్యమంత్రి.. సీనియర్‌ మంత్రిని పంపి ఆ కుటుంబానికి సానుభూతి తెలిపి, అక్కడే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. కాగా, సాయితేజ అకాల మరణం.. అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కష్టపడి జీవితంలో పైకి ఎదిగిన అతడు ఆకస్మికంగా తనువు చాలించడం అందరినీ కలచివేసింది.

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడ గ్రామానికి చెందిన సాయితేజ బాల్యం నుంచి చురుకైన వాడు. దేశ సేవలో తరించాలన్న సంకల్పంతో.. ఎంతో శ్రమించి కలలను సాకారం చేసుకున్నారు. పారా కమాండోగా చెరగని ముద్రవేసి.. త్రిదళాపతి బిపిన్ రావత్‌ను సైతం మెప్పించారు. ఈ నెల 8న తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో త్రిదాళపతి బిపిన్ రావత్ తో పాటు కన్నుమూశారు. రావత్ కు సాయితేజ వ్యక్తిగత భద్రతాధికారి. సాయి తేజ భౌతికకాయం నేడు స్వగ్రామం చేరనుంది. ఆలస్యమైతే రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.



Tags:    

Similar News