మోదీ మెడకు రూ.6 వేల కోట్ల కుంభకోణం..

Update: 2022-02-26 04:11 GMT
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇరుకున పెట్టే అస్త్రాలు రెడీ అవుతున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రతిపక్షాలు వెంటనే విరుచుకుపడుతున్నారు. మోదీకి సంబంధించిన లొసుగులు వెతికి పట్టి వాటిని బహిరంగం చేస్తున్నారు. అయితే ప్రధానమంత్రిపై ఆరోపణలు నిజమో..కాదో తరువాతి విషయం...కానీ జనాల్లో మోదీపై ఇంప్రెస్ పోవడానికి ఇలాంటివి ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. తాజాగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఓ విషయంపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో బొగ్గు కుంభకోణం జరిగినట్లు వెలుగులోకి వచ్చిందని, దీనితో మోదీకి ప్రత్యక్ష సంబంధం ఉందని ఆరోపిస్తున్నారు. ఈ కుంభకోణం జరిగిన సమయంలో మోదీ గుజరాత్ కు ముఖ్యమంత్రిగా ఉన్నారని అంటున్నారు.

గుజరాత్ రాష్ట్రంలో తాజాగా ఓ కుంభకోణం బయటపడిందని స్థానిక కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈమేరకు కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గుజరాత్ రాష్ట్రంలో 2001 నుంచి 2014 వరకు కోల్ ఇండియా 60 లక్షల టన్నుల బొగ్గును గుజరాత్లోని వ్యాపారులు, చిన్న పరిశ్రమల దారుల పేరిట పంపించింది. వాస్తవానికి ఈ బొగ్గు సగటు ధర టన్నుకు రూ.1,800 నుంచి రూ.3,000 వరకు ఉంటుంది. కానీ దానిని ఇతర రాష్ట్రాల్లో రూ.8000 నుంచి రూ.10000 వరకు అమ్ముకున్నారని ఆరోపించారు. అంటే మొత్తం రూ.6 వేల కోట్ల వరకు కుంభకోణం జరిగిందని అంటున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల  బొగ్గు లావాదేవీలతో బీజేపీ పెద్దలకు లింకులు ఉన్నాయని ఆరోపించారు.

ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి రాష్ట్రంలోని పెద్ద కంపెనీలకు భారీ ధరకు బొగ్గును అమ్మేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ బొగ్గు కుంభకోణంపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అయితే దాదాపు 20 సంవత్సరాలపాటు గుజరాత్ లో బీజేపీ అధికారంలో ఉందని, ఇందులో 14 సంవత్సరాల కాలంలో కుంభకోణం జరిగిందన్నారు. ఈ సమయంలో పరిశ్రమలు, గనులు, ఖనిజాల శాఖను మోదీ, విజయ్ రూపాణి, భూపేంద్ర పటేల్ ల వద్దే అంటిపెట్టుకున్నారని అంటున్నారు. ఇలా ఈ శాఖ వారి వద్దే ఉండడంపై అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు.

ఇదిలా ఉండగా కోల్ ఇండియా నుంచి తీసిన బొగ్గు పరిశ్రమలకు చేరాల్సి ఉంది. కానీ అలా జరగడం లేదు. దానిని లబ్ధిదారులకు పంపిస్తున్నామని చెప్పడం అవాస్తవమన్నారు. బొగ్గు దేనికోసమైతే వెలికి తీశారో.. దాని లక్ష్యం నెరవేరలేదని అన్నారు. అయితే నకిలీ బిల్లులు సృష్టించి కుంభకోణానికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ విషయంలో బీజేపీ పెద్దలు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఇలాంటి ఆరోపణలు పెద్ద ఎత్తున దుమారం లేపాయి. ఈ విషయంపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

గుజరాత్ కు సంబంధించిన ప్రతీ విషయంలో మోదీ హస్తం ఉంటోంది. రాష్ట్రంలో జరిగే పరిణామాలు ఆయన హయాంలోనే జరుగుతాయని అంటున్నారు. అలాంటప్పుడు బొగ్గు కుంభకోణం పై కూడా మోదీ బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. వాస్తవానికి ఏ రాష్ట్రంలోనైనా జరిగే అవకతవకలపై ఆ రాష్ట్ర సారథిని టార్గెట్ చేస్తాయి. కానీ గుజరాత్ లో ఏం జరిగిన ప్రధాన మంత్రి మెడకే చుట్టుకుంటాయి. అయితే ప్రతీ విషయాన్ని మోదీ, షాలు తమదైన రీతిలో సమాధానం చెబుతూ ఉంటారు. ఈ విషయంలో మోదీ ఎంట్రీ ఇస్తారా..? లేక షా కలుగ జేసుకుంటారా..? అనేది చూడాల్సి ఉంది. ఓ వైపు యూపీ ఎన్నికలు పూర్తి కాకముందే మోదీపై ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిని ఎదుర్కోవడానికి మోదీ ఏం చేస్తారో చూద్దాం..
Tags:    

Similar News