ప్ర‌వీణ్ కుమార్ దూకుడు.. కేసీఆర్ పై సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు!

Update: 2021-08-01 08:40 GMT
ఐపీఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, రాజ‌కీయాల్లోకి వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్న ఆర్‌.ఎస్ ప్ర‌వీణ్ కుమార్.. మాట‌ల్లోనూ దూకుడు పెంచారు. ఇన్నాళ్లూ కేవ‌లం నిర్మాణాత్మ‌క విష‌యాలు మాత్ర‌మే మాట్లాడిన ఆయ‌న‌.. ఇప్పుడు బ‌ల‌మైన రాజ‌కీయ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. శ‌నివారం ఉస్మానియా వ‌ర్సిటీ, నిజామాబాద్ జిల్లా లో జ‌రిగిన స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో.. పొలిటిక‌ల్ వార్ ప్ర‌క‌టించాన‌ని ప‌రోక్షంగా చాటిచెప్పారు.

హైద‌రాబాద్ ఉస్మానియా వ‌ర్సిటీలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు, ఉద్యోగుల స‌మావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా డిచ్ ప‌ల్లి మండ‌లం బ‌ర్దీపూర్ లోనూ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ రెండు కార్య‌క్ర‌మాల్లోనూ ప్ర‌వీణ్ కుమార్ పాల్గొన్నారు. బ‌హుజ‌న వ‌ర్గాల‌ను అభివృద్ధి చేసే ఆలోచ‌న పాల‌క వ‌ర్గాల‌కు లేద‌ని చెప్పారు. ఈ వ‌ర్గాల‌ను కావాల‌నే చ‌దువుకు దూరం చేస్తున్నార‌ని అన్నారు. విద్యాసంస్థ‌ల్లో నియామ‌కాలు చేపట్ట‌క‌పోవడానికి కార‌ణం ఇదేన‌ని అన్నారు. ద‌ళిత‌, బ‌హుజ‌నుల పిల్ల‌ల బ‌తుకులు బాగు ప‌డాలంటే.. బ‌హుజ‌న రాజ్య‌స్థాప‌నే అంతిమ ల‌క్ష్య‌మ‌ని అన్నారు. రాష్ట్రంలో గులాబీ జెండాను పాత‌రేసి.. నీలి జెండాను నిల‌బెట్టాల‌ని పిలుపునిచ్చారు.

ఇదేస‌మ‌యంలో.. కేసీఆర్ ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేశారు. మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాల‌తో ముఖ్య‌మంత్రి కేసీఆర్ రూ.50వేల కోట్ల‌ను దోచుకున్నార‌ని ఆరోపించారు. ఆ ప‌థ‌కాల్లో భారీగా క‌మీష‌న్లు దండుకొని, ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు చేస్తున్నార‌ని ఆరోపించారు. ఉద్య‌మాల‌తో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చార‌ని చెప్పారు. అణ‌గారిన వ‌ర్గాల మీద దారుణ‌ వివ‌క్ష చూపిస్తున్నార‌ని అన్నారు. ఎవ‌రెస్టు శిఖ‌రాన్ని అధిరోహించిన మాల‌వ‌త్ పూర్ణ‌కు కామారెడ్డిలో స్థ‌లం ఇచ్చి, బ్యాడ్మింట‌న్ క్రీడాకార‌ని సింధూకు హైద‌రాబాద్ బంజారాహిల్స్ లో స్థ‌లం కేటాయించ‌డమే వివ‌క్ష‌కు నిద‌ర్శ‌న‌మని అన్నారు.  ద‌ళిత బంధు ప‌థ‌కంపైనా ప్ర‌వీణ్ కుమార్ దండెత్తారు. ఏడేళ్లుగా ద‌ళితుల‌పై లేని ప్రేమ‌.. హుజూరాబాద్ ఉప ఎన్నిక స‌మ‌యంలోనే ఎందుకు వ‌చ్చిందో చెప్పాల‌ని నిల‌దీశారు. ద‌ళితుల‌ను పావులుగా వాడుకునేందుకే ఈ ప‌థ‌కాన్ని తెచ్చార‌ని, ఈ ప‌థ‌కానికి చేస్తున్న ఖ‌ర్చుతో విద్యార్థుల‌కు ఎన్నో సౌక‌ర్యాలు క‌ల్పించొచ్చ‌ని అన్నారు.

ఈ విధంగా.. వ‌రుస స‌మావేశాల‌తో, ప‌దునైన మాట‌ల‌తో కేసీఆర్ ను ఢీకొడుతున్నారు ప్ర‌వీణ్ కుమార్‌. అదే స‌మ‌యంలో.. బీఎస్పీని సైతం ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. త్వ‌ర‌లో ప్ర‌వీణ్ కుమార్‌ బ‌హుజ‌న స‌మాజ్ పార్టీలో చేర‌డం ఖాయ‌మైపోయిన సంగతి తెలిసిందే. అరంగేట్రం అట్ట‌హాసంగా ఉండాల‌ని భారీ స‌భ కూడా నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్నారనే ప్ర‌చారం సాగుతోంది.

న‌ల్గొండ జిల్లా నుంచే త‌న రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్రారంభించాల‌ని ప్ర‌వీణ్ కుమార్ నిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో.. అందుకు త‌గిన వేదిక‌ను సిద్ధం చేసే ప‌నిలో ప‌డ్డారు బీఎస్పీ, స్వేరోస్ స‌భ్యులు. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం ఆగ‌స్టు 8వ తేదీన న‌ల్గొండ‌లో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా ల‌క్ష‌న్న‌ర మందిని త‌ర‌లించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేర‌కు బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ కార్య‌క‌ర్త‌లు, స్వేరోస్ స‌భ్యులు గ‌డిచిన రెండు రోజులుగా న‌ల్గొండ జిల్లాలోని ప‌లు గ్రామాల్లో తిరుగుతూ జ‌నాన్ని స‌మీక‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇందుకోసం జిల్లాలోని 12 నియోజ‌క‌వ‌ర్గాల‌కు బాధ్యుల‌ను నియ‌మించిన‌ట్టు తెలుస్తోంది. వీరి ఆధ్వ‌ర్యంలో స‌భ‌ను విజ‌య‌వంతం చేసేందుకు సీరియ‌స్ గా ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. మ‌రి, రాబోయే రోజుల్లో ప్ర‌వీణ్ కుమార్ రాజ‌కీయం ఇంకా ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News