యువరాజు ఆ కేసు నుంచి బయటపడినట్లేనా?

Update: 2016-08-25 04:31 GMT
ఆర్ ఎస్ ఎస్ పై నోరు జారినట్లుగా కోర్టులో విచారణ జరుగుతున్న కేసులో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు.. ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ బయటపడినట్లేనా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. జాతిపిత మహాత్మా గాంధీ హత్య విషయంలో ఆర్ ఎస్ ఎస్ మొత్తాన్ని నిందించలేదంటూ రాహుల్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వాదించిన తీరు ఆయన్ను బయటపడేసేలా ఉందన్న వాదన వినిపిస్తోంది. గాంధీ హత్యకు సంఘ్ కారణమంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆర్ ఎస్ ఎస్ పరువు నష్టం దావా వేయటం తెలిసిందే. గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా రాహుల్ ను ఉద్దేశించి సుప్రీంకోర్టు.. సంఘ్ మొత్తాన్ని నిందించటం తప్పు అని చెప్పటంతో పాటు.. క్షమాపణలు చెప్పి రాజీ చేసుకోవచ్చంటూ సూచన చేసింది.

అయితే.. దీనిపై రాహుల్ గాంధీ భిన్నంగా స్పందించారు. తాజాగా ఈ పరువునష్టం కేసులో రాహుల్ తరఫున వాదించిన మాజీ కేంద్రమంత్రి.. న్యాయవాది కపిల్ సిబల్.. రాహుల్ చేసిన వ్యాఖ్యలు సంఘ్ కు చెందిన అందరివి కాదని.. రాహుల్ సంఘ్ మత్తాన్ని నిందించలేదన్నారు. సంఘ్ తో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు మాత్రమే అన్నారని కోర్టుకు స్పష్టం చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాజాగా జరిగిన విచారణలో రాహుల్ సమాధానం నేపథ్యంలో పరువునష్టం దావాను కోర్టు కొట్టేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 1న జరగనుంది. సంఘ్ మొత్తాన్ని తాను నిందించలేదని.. కేవలం సంఘ్ కు సంబంధం ఉన్న కొందరిని మాత్రమే తాను విమర్శించినట్లుగా సుప్రీంకు రాహుల్ తన సమాధానంతో స్పష్టం చేసిన నేపథ్యంలో..పరువునష్టం దావా నుంచి రాహుల్ సేఫ్ గా బయటకు వచ్చే అవకాశం ఉందని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వాదనకు బలం చేకూరేలా సుప్రీం తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు. ఆర్ఎస్ ఎస్ మొత్తాన్ని రాహుల్ నిందించలేదన్నవిషయం అర్థమవుతుందంటూ సుప్రీం న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కేసులో రాహుల్ బయటపడే అవకాశం ఉన్నట్లేనని చెబుతున్నారు.
Tags:    

Similar News