పెట్రోల్ రేట్లుః గుత్తాజ్వాల‌పై ఆరెస్సెస్ నేత వ్యాఖ్య‌లు.. నెటిజ‌న్ల ఘాటు రిప్లై!

Update: 2021-07-13 12:30 GMT
గ‌తంలో.. నిత్యావ‌స‌రాలు, పెట్రోల్ ధ‌ర‌ల రేట్లు పెరిగిన‌ప్పుడు అధికార పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ముఖం చూపించ‌కుండా త‌ప్పించుకు తిరిగేవారు. కానీ.. ఇప్పుడు బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల‌పై ద‌బాయింపున‌కు దిగుతున్నారు. ఆ మాత్రం పెట్రోల్ రేటు పెట్ట‌లేరా? అంటూ నేరుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటి వారిని నెటిజ‌న్లు త‌లెత్తుకోలేకుండా చేస్తున్నారు. తాజాగా.. ఓ ఆరెస్సెస్ నాయ‌కుడు ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ గుత్తా జ్వాల‌పై ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేస్తే.. నెటిజ‌న్లు తీవ్రంగా మండిప‌డ్డారు.

ప్ర‌స్తుతం.. దేశంలో పెట్రోల్ ధ‌ర‌లు ఆకాశాన్ని తాకుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ లీట‌రు పెట్రోలు ధ‌ర‌ వంద రూపాయ‌ల పైనే ఉంది. రాజ‌స్థాన‌ల్లో గ‌రిష్ఠంగా 114 రూపాయ‌ల‌ను తాకింది. ఏపీలో లీట‌రు పెట్రోల్ ధ‌ర‌ 106 రూపాయ‌లు, తెలంగాణ‌లో 104 రూపాయ‌లుగా ఉంది. దీంతో.. జ‌నాలు మండిప‌డుతున్నారు. ఇదే విష‌య‌మై ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ గుత్తా జ్వాల సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘పెట్రోలు ధర కేవలం రూ.105.55 రూపాయలు మాత్రమే’’ అని వెటకారంగా ట్వీట్ చేసింది.

దీనికి ఆరెస్సెస్ నేత శీత‌ల్ మ‌న్స‌బ్దార్ చోప్రా స్పందిస్తూ.. ‘‘నీకు 70 లక్షల రూపాయల విలువైన కారును కొనే స్థోమత ఉందిగానీ.. 105 రూపాయ‌లు పెట్టి పెట్రోల్ కొన‌లేవా?’’ అని రిప్లే ఇచ్చింది. దీంతో.. నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నెల‌కు ప‌ది వేలు, ప‌దిహేను వేలు సంపాదించుకునే వారి ప‌రిస్థితి ఏంటీ? 105 రూపాయ‌లు పెట్టి పెట్రోల్ కొన‌గ‌ల‌రా? అంటూ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. కేంద్రం పెట్రోల్ ధ‌ర‌లు పెంచుతోంద‌ని మండిప‌డ్డారు. ఇలాంటి విష‌యాన్ని కూడా మీరు స‌మ‌ర్థిస్తున్నారా? కొంచెం కూడా ఆలోచన లేదా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా.. తెలుగు సినీ న‌టుడు నిఖిల్ సిద్ధార్థ్ కూడా పెట్రోల్ ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఈ మేర‌కు ట్విట‌ర్ లో ఒక పోస్టు పెట్టారు. దానికి చెట్టెక్కిన పెట్రోల్ పంపుల ఫొటోను జ‌త చేశారు. ఇందులో వాహ‌న‌దారుడు కింద ఉండి అందుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. దీన్ని షేర్ చేసిన నిఖిల్‌.. ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. ‘‘అసలేం జరుగుతోంది? 35 రూపాయలు ఉండాల్సిన పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌.. ఇప్పుడు బంకుల‌లో ఉండే పంపుల వ‌ద్ద 100 రూపాయ‌లు దాటేసింది. ఇంధ‌న ధ‌ర‌ల‌పై కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు విధించే ట్యాక్స్ ల‌ను వెంట‌నే ర‌ద్దు చేయాలి. ఇలా నిత్యం ధ‌ర‌లు పెరిగిపోవ‌డం కార‌ణంగా ఇబ్బంది ప‌డుతున్న‌ ప్ర‌తి ఒక్క‌రి త‌ర‌పున నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను’’ అని నిఖిల్ రాశారు. దీంతో.. ఈ ట్వీట్ వైరల్ గా మారింది. నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. కేంద్ర, రాష్ట్ర‌ ప్ర‌భుత్వాల తీరును విమ‌ర్శిస్తున్నారు.
Tags:    

Similar News