డ్రైవ‌ర్ ఆత్మాహుతితో కేసీఆర్‌ కు టీ ఆర్టీసీ సెగ పెరిగింది...

Update: 2019-10-13 08:44 GMT
బంగారు తెలంగాణ ఏర్ప‌డితే.. తెలంగాణ ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామ‌ని.. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో అప్ప‌టి తెలంగాణ ఉద్య‌మ నాయ‌కుడు - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీని అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ.. టీ ఆర్టీసీ కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్య‌మం తీవ్ర రూపం దాల్చింది. దాదాపు 43 వేల మంది కార్మికుల‌ను ఉద్యోగాల నుంచి తీసి వేస్తున్నామ‌ని - వారితో చ‌ర్చించేది కూడా లేద‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన 24 గంట‌ల్లోనే నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఖమ్మం డిపో డ్రైవర్‌ శ్రీనివాసరెడ్డి శనివారం ఖమ్మంలోని తన ఇంటి వద్ద కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం శనివారం సాయంత్రం  హైదరాబాద్‌ కు  తరలించారు. కంచన్‌ బాగ్‌ లోని డీఆర్‌ డీవో ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్‌ రెడ్డి ఆదివారం ఉదయం మృతి చెందారు. దీంతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మ‌రోప‌క్క‌ - సోమ‌వారం ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లా బంద్‌ కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే, ఆర్టీసీ ఉద్య‌మం తీవ్ర రూపం దాలుస్తుండ‌డంతో కేసీఆర్ కూట‌మికి చెమట‌లు ప‌డుతున్నాయి. ఊహించ‌ని ప‌రిణామంగా శ్రీనివాస‌రెడ్డి ఆత్మాహుతికి పాల్ప‌డ‌డంతో ప్ర‌భుత్వం పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. 

ఉద్య‌మాల‌తో ఏర్పాటు చేసుకున్న రాష్ట్రంలో అస‌లు ఉద్య‌మాలే వ‌ద్ద‌ని ఉద్య‌మాలు చేసే అర్హ‌త ఏ ఒక్క‌రికీ లేద‌ని గ‌డిచిన ఐదేళ్ల నుంచి కూడా కేసీఆర్ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇందిరా పార్కు వ‌ద్ద ధ‌ర్నా చౌక్‌ ను తొల‌గించారు. అయితే, హైకోర్టు జోక్యంతో అనేక నిబంధ‌న‌ల మ‌ధ్య ఇక్క‌డే ధ‌ర్నా చౌక్ కొన‌సాగుతోంది. కానీ, ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కోరుతున్న అప్ప‌టి డిమాండ్‌ ను ప‌రిష్క‌రించ‌డంలో కేసీఆర్ చూపుతున్న అత్యంత బాధాక‌ర ప‌రిణామంపై ప్ర‌జ‌ల్లోనూ తీవ్ర వ్య‌తిరేక వ‌స్తోంది. సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర‌కు కూడా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. శ్రీనివాస‌రెడ్డి ఆత్మ‌త‌ర్ప‌ణంతో అయినా.. ప్ర‌భుత్వం దిగిరావాల‌ని వారు డిమాండ్లు చేస్తున్నారు. మ‌రి కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News