కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో మసాజ్ రూం?

Update: 2017-03-02 05:42 GMT
వినటానికే ఆశ్చర్యంగా ఉన్న ఈ ప్రశ్నను.. ఏకంగా అధికారులకే సంధించాడో సమాచార హక్కు కార్యకర్త ఒకరు. ఆర్భాటంగా ప్రారంభించిన సీఎం క్యాంప్ కార్యాలయంలో మసాజ్ రూం ఉందా? అక్కడ ఎలాంటి ఫర్నీచర్ను వాడుతున్నారు? సీఎం ఇంట్లో ఎన్ని ఏసీలు ఉన్నాయి? అవి ఎలా ఉంటాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలే కాదు.. ఫోటోలు కూడా కావాలంటూ అడుగుతున్న ఆర్టీఏ అప్లికేషన్లకు సమాధానాలు ఏం ఇవ్వాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు తెలంగాణ రాష్ట్ర అధికారులు.

ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యాలయాల మీదా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు మీదా సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న సీఎం క్యాంప్ కార్యాలయంలో మసాజ్ రూం ఉందా? అన్న ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదన్న మాట వినిపిస్తోంది.

సమాచార హక్కు చట్టం ప్రకారం.. దరఖాస్తుదారు అడిగిన ప్రశ్నకు నెల రోజుల వ్యవధిలో సమాధానం పంపాల్సి ఉంటుంది. ఒకవేళ.. సమాధానాన్ని పంపని పక్షంలో దరఖాస్తుదారు అప్పీలుకు వెళ్లే వీలుంది. ఇది మరిన్ని సమస్యలకు తావిచ్చే వీలుందని.. అదే సమయంలో పలువురు అడుగుతున్న కొన్ని ప్రశ్నలకు ఏం సమాధానాలు చెప్పాలో అర్థంకావటం లేదని చెబుతున్నారు.

ఇటీవల కాలంలో కొందరు చేస్తున్న దరఖాస్తులు.. కావాలనే చట్టాన్ని దుర్వినియోగం చేసేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరికొందరు ప్రభుత్వ కార్యాలయాల్లో చెక్కతో తయారు చేసిన కుర్చీలు ఎన్ని ఉన్నాయో లెక్కచెప్పాలని అడుగుతున్నారని.. ఇవన్నీ లెక్క కట్టటం చాలా కష్టంగా మారుతుందని చెబుతన్నారు. గత ఏడాదిలో హైదరాబాద్ కలెక్టరేట్ కు దాదాపు వెయ్యికి పైగా దరఖాస్తులు వస్తే.. మసాజ్ రూం ఉంది తరహా ప్రశ్నలు దాదాపు 300 పైనే ఉన్నాయని.. వీటికి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి పాలకులకు ప్రజలు తమ ప్రశ్నలతో చుక్కలు చూపిస్తున్నారన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News