మోడీ ఇలాకాలో 100 మంది నకిలీ డాక్టర్లు

Update: 2017-03-11 05:52 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో భారీ కుంభ‌కోణం జ‌రిగింది.  ఆ రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో వ్యాపం తరహా కుంభకోణం చోటుచేసుకుంది. గుజరాత్‌ యూనివర్సిటి - భారత వైద్య మండలి(ఎంసిఐ) దాఖలు చేసిన ఆర్‌ టిఐలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వైద్య ప్రవేశ పరీక్షలో విఫలమైన దాదాపు 100 మందికి పైగా విద్యార్ధులుకు గుజరాత్‌ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలు డిగ్రీలను ప్రదానం చేశాయి. దీనికి సంబంధించిన ఫిర్యాదును ముఖ్యమంత్రి విజయ్‌ రూపాని కార్యాలయానికి, ప్రధాన మంత్రి కార్యాలయానికి ఆ సంస్థలు పంపాయి. దీంతో ఈ వార్త దేశ‌వ్యాప్తంగా కల‌క‌లం సృష్టిస్తోంది.

గుజరాత్‌ విశ్వవిద్యాలయాలకు అనుబంధంగా ఉన్న పీజీ వైద్య కళాశాలల్లో ప్రవేశానికై జనవరి 2015లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని బీజే వైద్య కళాశాల - ఎన్‌ హెచ్‌ ఎల్‌ కళాశాలల్లో 300 సీట్లు ఉంటే 900 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కేవలం 200 మంది మాత్రమే పరీక్షలో ఉత్తీర్ణులై సీట్లు సంపాదించుకున్నారు. దాదాపు 100 సీట్లు మిగిలిపోయాయి. కాగా ఆరోగ్య శాఖకు చెందిన వైద్యులు, అధికారులు తమకు తెలిసిన వారి పిల్లలకు సీట్లు ఇచ్చేందుకు నిబంధనలు ఉల్లంఘించారని ఆర్‌ టిఐ వెల్లడించింది. వైద్య మండలి (ఎంసిఐ) నిబంధనల మేరకు పరీక్షకు హాజరు కాని విద్యార్ధులు, పరీక్షలో ఉత్తీర్ణులు కాని విద్యార్ధులకు పిజి మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశాలకు అనుమతి వుండదు. ఈ నిబంధనలను ఉల్లంఘించి తమకు తెలిసిన వారికి సీట్లు ఇచ్చేందుకు తప్పుడు మార్కుల జాబితాను ఎంసిఐకి పంపారు. అసలు పరీక్షకే హాజరుకాని కొంతమంది విద్యార్థుల పేర్లను ఆర్‌టిఐ పేర్కొంది. అయితే వారు పరీక్ష ఉత్తీర్ణులైనట్లు రికార్డులు వున్నాయి. దీనికి తోడు ఎంసిఐని తప్పుదోవ పట్టిస్తూ కొన్ని కేసులలో నకిలీ కుల థృవీకరణ పత్రాలను కూడా పొందుపరిచారు. ఇలా సీట్లు పొందిన విద్యార్ధులందరూ ప్రముఖ డాక్టర్లు, ప్రభుత్వ అధికారుల కుటుంబాలకు చెందిన వారే కావడం విశేషం.

ఆర్‌టిఐలో ఇచ్చిన సమాచారం మేరకు ఒక విద్యార్థిని ప్రవేశ పరీక్షలో కేవలం 41 శాతం మాత్రమే మార్కులు సాధించింది. కానీ ఆమె 53 శాతం మార్కులు పొందినట్లు ఎంసిఐ రికార్డుల్లో నమోదైంది. పలువురు విద్యార్థులకు సంబంధించి ఎంసిఐకి పంపిన మార్కుల జాబితాలో పలు వ్యత్యాసాలున్నాయని ఆర్‌టిఐ పేర్కొంది. దీనిపై హెల్త్‌ కమిషనర్‌ జెపి గుప్తా మాట్లాడుతూ గుజరాత్‌ రాష్ట్ర కమిషనర్‌ కు  దీనిపై వారం క్రితమే ఫిర్యాదు అందిందన్నారు. యూనివర్సిటీలో పాత రికార్డులను నమోదు చేస్తామని తెలిపారు. ఫిర్యాదును, రికార్డును రెండిటిని పరిశీలించిన తరువాతే తదుపరి చర్య తీసుకుంటామని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News