హుజూరాబాద్ అధికార పార్టీలో క‌ల‌క‌లం.. ఏం జ‌రుగుతోంది?

Update: 2022-12-25 14:30 GMT
బీఆర్ ఎస్ జాతీయ పార్టీగా మారిన టీఆర్ ఎస్‌లో కొత్త గుబులు బ‌య‌ల్దేరింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ ఎస్‌ను బ‌లంగా న‌డిపించే నాయ‌కుడు క‌నిపించ‌డం లేదట‌.  అంతేకాదు.. ఇప్పుడు ఇక్క‌డ పార్టీ కూడా మూడు ముక్కలుగా మారింద‌నే టాక్ వినిపిస్తోంది మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంతో హుజూరాబాద్ లో అధికార పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిగా మారింది.

బీఆర్ఎస్‌లో అక్కడ ఈటలకు ప్రత్యామ్నాయ నేత ఇంకా తయారు కాలేదనే అనిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల బీజేపీలో చేరి తిరిగి అసెంబ్లీకి ఎన్నికై తన బలాన్ని చూపించుకున్నా రు. ఈ ఎఫెక్ట్ కూడా హుజూరాబాద్‌లో అధికార పార్టీపై ఎక్కువే ఉంది. మ‌రోవైపు నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కేడర్‌లో ఒకింత గందరగోళానికి దారితీస్తున్నాయి.

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించి ఇద్దరు నుంచి ముగ్గురు నేతలు హుజూరాబాద్  టికెట్ కోసం పోటీ పడుతున్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన కౌశిక్ రెడ్డి ఆ తరవాత జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. వ్యూహ ప్రతి వ్యూహాల నేపథ్యంలో ఉప ఎన్నికలకు ముందు కారెక్కారు.

కానీ టిక్కెట్ దక్కలేదు. దీంతో కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఎమ్మెల్సీ ఇచ్చినా కౌశిక్‌రెడ్డి మాత్రం సంతృప్తి చెందలేదు. ఇటీవల ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయంటున్నారు. ఎమ్మెల్సీ పదవి తృప్తిగా లేదు తనను ఎమ్మెల్యేగా గెలిపించండి అని కౌశిక్ వ్యాఖ్యానించారు. అందరూ తనను ఆశీర్వదించాలని కోరారు.

మరోవైపు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఈటల మీద ఓడిపోయిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి  పోటీ చేసేది తానే అని ప్రకటించారు. ఇక మునుగోడుతో రాష్ట్రంలో పొడిచిన కొత్త పొత్తుల్లో హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కూడా పరిణామాలు మారే అవకాశాలున్నాయి. పొత్తు కుదిరితే కనుక ఆ సీటు సీపీఐకి వెళ్తుంది.

దీంతో సిట్టింగ్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సతీష్ బాబు హుజూరాబాద్‌కి వచ్చే అవకాశం ఉంది. సతీష్‌బాబు కూడా సొంత నియోజకవర్గానికి వస్తే హుజూరాబాద్‌ కోరుకునే వారి సంఖ్య మూడుకు చేరుతుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ టిక్కెట్ ఎవరికి అన్న ప్రశ్న తలెత్తుతోంది. మొత్తానికి ఈ ప‌రిణామాలు ఈట‌ల‌కు లాభించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News