జగన్ మెగా స్టార్ భేటీ.. ఇటు వైపూ తేల్చేశారా...?

Update: 2022-01-15 10:14 GMT
నిప్పు లేనిదే పొగ రాదు అన్నారు. ఏదో జరిగి ఉంటుంది అని కూడా అనుకున్నారు. ఎవరి ఊహకు వారు తోచినది అల్లారు. మొత్తానికి చూస్తే ఏమీ లేదు అని తేలిపోయింది. అదే జగన్ మెగాస్టార్ ల మధ్య జరిగిన వన్ టూ వన్ భేటీ. ఈ భేటీ మీద ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేశారు. అయితే ఇక్కడ చెప్పాల్సింది అయితే ఇద్దరే ఇద్దరు.  వారే జగన్, చిరంజీవి, ఈ ఇద్దరి మధ్యనే ఎవరూ లేరు. చెబితే వారే అసలు ఏం జరిగింది అన్నది చెప్పాలి.

చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం కోరుకున్నారని ఒక వైపు కధనాలు వస్తే, ఆయనకు జగన్ ఆఫర్ చేశారు అని మరో వైపు వార్తలు వచ్చాయి. దీంతో సినిమా టికెట్ల కధ వెనక్కు పోయి ఈ ఊహాగానాలే పెద్ద ఎత్తున రచ్చ  రచ్చ అయ్యాయి. చివరికి ఈ మొత్తం విషయం కాస్తా ఎటో వెళ్ళిపోతోంది అని గ్రహించిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి దాన్ని స్ట్రాంగ్ గా ఖండించారు. తాను రాజకీయాల్లోకి తిరిగి వచ్చే ప్రసక్తి లేనే లేదని తేల్చేశారు.

అంతే కాదు, తనకు ఎవరూ ఏ ఆఫర్ ఇవ్వలేదని,  తాను కూడా పదవులకు అతీతమని కూడా చెప్పారు. చిరంజీవి ఇలా చెప్పారో లేదో అవతల వైపు నుంచి జగన్ ని సన్నిహితుడైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా రంగంలోకి దిగారు.  కేవలం సినిమా రంగంలోని సమస్యల మీద చర్చించడానికి మెగాస్టార్ జగన్ కలిస్తే దాన్ని కూడా రాజకీయం పులిమి రచ్చ చేస్తున్నారు అని బాలినేని మండిపడ్డారు.

అన్నదమ్ములు అయిన చిరంజీవి, పవన్ ల మధ్య చిచ్చు పెట్టే దారుణమైన రాజకీయం జగన్ ఏ రోజూ చేయరని స్పష్టం చేశారు. ఆయనకు ఆ అవసరం కూడా లేదని బాలినేని అందడం విశేషం.  పార్టీ పెట్టినప్పటి నుంచి ఒంటరిగానే జగన్ పోటీ చేస్తున్న సంగతిని కూడా ఆయన గుర్తు చేయడం గమనార్హం. సినిమా రంగం సమస్యలను జగన్ తనకు తోచిన రీతిన పరిష్కరిస్తారు అని కూడా బాలినేని చెబుతున్నారు.

కొందరు  ఉద్దేశ్యపూర్వకంగానే ఈ భేటీని రాజకీయం చేస్తున్నారు అని బాలినేని ఆరోపించారు. మరి ఆ కొందరు ఎవరో ఆయన చెప్పలేదు. బహుశా టీడీపీ మీదనే ఆయన బాణాలు వేశారు అనుకోవాలా అన్న చర్చ కూడా వస్తోంది. అంతే కాదు అసలు చిచ్చు పెట్టేదే చంద్రబాబు అని బాలినేని హాట్ కామెంట్స్ చేయడం కూడా విశేషం. దళితులు, కాపుల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు అని ఆయన అంటున్నారు.

ఇవన్నీ ఎలా ఉన్నా అటు చిరంజీవి రియాక్ట్ అయ్యారు. ఆ వెంటనే జగన్ కి బంధువు కూడా అయిన బాలినేని ఇటు రియాక్ట్ అయ్యారు. అంటే జగన్ మనసులోని మాటనే బాలినేని చెప్పారనుకోవాలి. ఇలా వన్ టూ వన్ గా సాగిన ఈ భేటీలో రాజకీయ ప్రస్థావన కానీ రాజ్యసభ సీటు ఆఫర్ కానీ రాలేదని అటూ ఇటూ తేల్చేశారు అనుకోవాలి. మరి ఇంతటితో అయినా ఈ ఊహాగానాలు ఆగుతాయా. లేక మరింతగా రాజుకుంటాయా. వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News