అంతర్జాతీయ కరెన్సీ దిశగా రూపాయి.. అదెలానంటే?

Update: 2022-12-20 23:30 GMT
మన కరెన్సీ రూపాయి. ఇది మనకు మాత్రమే ఉండే కరెన్సీ. ఒకవేళ విదేశాలకు వెళ్లాలంటే ఆయా దేశాల కరెన్సీ (అమెరికా డాలర్.. రష్యా పౌండ్.. జపాన్ యెన్.. ఇండోనేషియా రూపియా ఇలా ఒక్కో దేశానికి ఒక్కో కరెన్సీ) లతో మారకం చేసుకోవాలి. అది సాధ్యం కాదు కాబట్టి.. ప్రపంచ వ్యాప్తంగా దేశాలన్ని కూడా విదేశీ వ్యాపార వ్యవహారాల్ని అంతర్జాతీయ కరెన్సీగా మారిన డాలర్ ఆధారంగా జరుపుతారు. అందుకే.. ఏదైనా దేశం వెళితే.. అమెరికా డాలర్లు మన వెంట పెట్టుకొని వెళ్లి.. అక్కడ డాలర్లను ఆయా దేశాల కరెన్సీగా మారుస్తుంటామన్నది తెలిసిందే.

ఇప్పుడు డాలర్ కు ఏ రీతిలో అయితే అంతర్జాతీ కరెన్సీగా మారి వెలిగిపోతుందో.. ఆ దిశగా అడుగులు మొదలయ్యాయి. తాజాగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో ఉన్న దేశాలతో రూపాయిలతోనే ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వీలుగా ఆర్ బీఐ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రష్యా.. శ్రీలంక.. మారిషస్ దేశాలతో రూపాయిలతో ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు మార్గం సుగమైంది.

రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్.. తజక్ స్థాన్.. క్యూబా.. లగ్జెంబర్గ్.. సూడాన్.. గల్ఫ్ దేశాలు.. ఆఫ్రికన్ దేశాల మధ్య కూడా రూపాయితోనే చెల్లింపులు జరిపేలా అడుగులు పడుతున్నాయి. వీలైనన్ని ఎక్కువ దేశాల్లో రూపాయిల్లో చెల్లింపులు జరిపేందుకు వీలుగా అనుమతి ఇప్పుడున్న విధానాన్ని మార్చాలని కేంద్రం భావిస్తోంది. దీనికి తగ్గట్లే.. ఆయా దేశాలు సైతం మన ఆర్బీఐను సంప్రదిస్తున్నాయి. ఎక్కువ దేశాల మధ్య రూపాయిల్లోనే లావాదేవీలు జరిపిన పక్షంలో.. మనది కూడా అంతర్జాతీయ కరెన్సీగా అవతరిస్తుందని చెప్పాలి.

ఇదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి బలపడుతుంది. డాలర్ మీద ఆధారపడటం తగ్గుతుంది. దేశ వాణిజ్య లోటు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. నిజానికి ఈ తరహా ఆలోచనలకు ఇటీవల చోటు చేసుకున్న సంక్షోభాలు కారణంగా చెప్పాలి. రష్యా విషయానికి వస్తే ఉక్రెయిన్ తో జరుగుతున్న పోరు కారణంగా.. అంతర్జాతీయంగా ఆ దేశంపై ప్రాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో.. డాలర్లు వారికి దొరకని పరిస్థితి. ఇలాంటి వేళ.. భారత్ కు చౌకగా చమురు ఇస్తామని చెప్పింది. అయితే.. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా డాలర్లలో చెల్లింపులు జరిపే పరిస్థితి లేకపోవటంతో.. రూపీ ట్రేడింగ్ కు అవకాశ: ఇవ్వాలన్న ప్రతిపాదన తెర మీదకు వచ్చింది.

దీంతో.. ఆ దిశగా అడుగులు వేసేందుకు వీలుగా పన్నెండు వోస్ట్రో ఖాతాల్ని తెరిచి రూపాయి - రూబుల్స్ లోనే వాణిజ్యం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అంటే.. గతంలో ఈ రెండు దేశాల మధ్య వేర్వేరు కరెన్సీలు ఉండటంతో డాలర్ ను ఆధారంగా చేసుకొని లావాదేవీలు జరిగాయి. ఇప్పుడు మాత్రం రూపాయి - రూబుల్స్ ఆధారంగా జరుగుతాయి. దీని వల్ల మనకు జరిగే లాభం ఏమంటే.. రష్యాకు చెల్లింపులు జరపాల్సి వస్తే ఇంతకు ముందు డాలర్లతో చెల్లింపులు జరపాల్సి వచ్చింది.

ఇప్పుడు మన రూపాయితో చెల్లింపులు జరుపుతాం. వారు మన దగ్గర ఏదైనా వస్తువులుకొన్నప్పుడు వారికి మనం ఇచ్చిన రూపాయిల్ని మనకు ఇస్తారు. దీంతో.. ఇక్కడ చెల్లింపులకు రూపాయి ప్రధానమైంది. అదే సమయంలో డాలర్ మీద ఆధారపడటం తగ్గింది. ఇలా పలు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవటం ద్వారా.. డాలర్ మీద ఆధాపడటం తగ్గుతుంది. అదే సమయంలో రూపాయి బలపడే వీలుంది. సో.. మన రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారే దశకు సంబంధించిన కీలక అడుగు తాజాగా పడిందని చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News