మోడీజీ..రూపాయిని భారీగా దెబ్బేస్తున్నారుగా!

Update: 2018-06-27 05:49 GMT
మేం ప‌వ‌ర్లోకి వ‌చ్చినంత‌నే అంత‌కంత‌కూ ప‌త‌న‌మ‌య్యే రూపాయి విలువ‌ను పెంచేస్తాం. జ‌మానాలో రూపాయి ఎంత బ‌లంగా ఉండేదో.. అలాంటి రోజుల్ని తీసుకొస్తామంటూ రంగుల సినిమాను త‌మ మాట‌ల్లో చూపించారు మోడీ అండ్ కో. ఆయ‌న కోరుకున్న‌ట్లు నాలుగేళ్ల క్రితం దేశ ప్ర‌జ‌లు ఆయ‌న చేతికి అధికారాన్ని ఇచ్చారు.

గ‌డిచిన నాలుగేళ్ల‌లో చూస్తే.. డాల‌రుతో రూపాయి మార‌కం విలువ ఎంత‌గా త‌గ్గిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆల్ టైం హైగా ఉన్న రూపాయి ప‌త‌నం.. రానున్న రోజుల్లో మ‌రింత దారుణంగా ఉండ‌నుందా? అంటే అవున‌నే హెచ్చ‌రిక వినిపిస్తోంది.

అంత‌ర్జాతీయ ఆర్థిక సేవ‌ల సంస్థ బార్ క్లేస్ తాజాగా విడుద‌ల చేసిన నివేదిక‌లో రూపాయి విలువ మీద భారీ హెచ్చ‌రిక‌ను జారీ చేసింది. గ్లోబ‌ల్ మార్కెట్లో కొండెక్కిన ముడిచ‌మురు ధ‌ర‌ల‌తో పాటు.. విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్ట‌ర్లు భార‌త్ లో పెట్టుబ‌డుల్నిఉప‌సంహ‌రించుకోవ‌టం అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టంతో రూపాయి విలువ ప‌డిపోతోంది. రానున్న రోజుల్లో ఈ పడిపోవ‌టం మ‌రింత ఎక్కువ కానున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.

స‌ద‌రు సంస్థ అంచ‌నా వేసిన‌ట్లే జ‌రిగితే.. ఈ ఏడాది చివ‌రి నాటికి డాల‌రుతో దేశీయ క‌రెన్సీ రూపాయి మార‌కం విలువ రూ.72 వ‌ర‌కు ప‌డిపోతుంద‌న్న మాట వినిపిస్తోంది. అదే జ‌రిగితే ఏడాదిలో రూపాయి విలువ 11.3 శాతం ప‌డిపోయిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌స్తుతం డాల‌రుతో రూపాయి మార‌కం విలువ రూ.68 గా ఉంది. ప్ర‌తికూల బాండ్ మార్కెట్ తో పాటు.. ఆర్ బీఐ విధానంలో అస్ప‌ష్ట‌త‌.. 2019లోజ‌ర‌గాల్సిన ఎన్నిక‌లు ఈ ఏడాదిలోనే జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న ముంద‌స్తు అంచ‌నాలతో రాజ‌కీయ అనిశ్చితి అంత‌కంత‌కూ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తో రూపాయి విలువ క్షీణిస్తోంది.

బ‌క్కిచిక్కిపోతున్న రూపాయిని బ‌లోపేతం చేయ‌టం మీద మాట్లాడ‌ని మోడీ.. ముంద‌స్తు మీద మాత్రం త‌న మాట‌ల‌తో సంకేతాలు ఇచ్చేస్తున్నారు. ముందు చేతిలో అధికారం మ‌రో ఐదేళ్లు ఉంటే.. రూపాయి సంగ‌తి అప్పుడు చూసుకోవ‌చ్చంటారా మోడీజీ?
Tags:    

Similar News