యుద్ధంపై రష్యా కీలక ప్రకటన.. స్పందించిన ఉక్రెయిన్

Update: 2022-02-25 14:30 GMT
ఉక్రెయిన్ తో యుద్ధంపై రష్యా విదేశాంగ శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ సైన్యం గనుక పోరాటం ఆపితే చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఉక్రెయిన్ ఆర్మీ ఆయుధాలను వదిలి లొంగిపోవాలని.. అప్పుడే చర్చలకు ముందుకెళతామని ఓ ప్రకటనలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ వెల్లడించారు.

ఉక్రెయిన్ ను నియో-నాజీల తరహాలో పాలించడం మాస్కోకు ఇష్టం లేదని రష్యా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు సైతం ప్రకటించారు. ఇరు దేశాల చర్చల ప్రస్తావన తేవడంతో యుద్ధం దాదాపు ముగింపు దశకు వచ్చినట్లే కనపడుతోంది. రష్యా-ఉక్రెయిన్ లు సయోధ్య దిశగా అడుగులు వేయడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

ఉక్రెయిన్ పై యుద్ధానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటడంతో పుతిన్ ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించింది. దేశంలోని 53 పట్టణాల్లో సుమారు 1700 మందికిపైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఒక్క మాస్కోలోనే 900 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెయింట్ పీటర్స్ బర్గ్ లో 400 మంది నిరసనకారులను జైళ్లకు తరలించారు.

అంతకుముందు పలువురు జర్నలిస్టులు, మీడియా ప్రముఖులు రష్యా కార్యకలాపాలను ఖండిస్తూ ఓ పిటీషన్ పై సంతకం చేశారు. మాస్కో, సెయింట్ పీటర్స్ బర్గ్, సమారా, రియాజాన్, సహా ఇతర నగరాల నుంచి వందమందికి పైగా మున్సిపల్ డిప్యూటీలు రష్యా పౌరులకు బహిరంగ లేఖపై సంతకం చేశారు.

ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులంతా ఉక్రెయిన్ పై సైన్యం దాడిని ఖండించారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. ఇది అసమానమైన దురాగతం అని.. దీనికి సమర్థన ఉన్నా ఈ హింసను సమర్థించకూడదు అని వెల్లడించారు.

దేశంలో అంతర్గత ఉద్రిక్తతల నేపథ్యంలోనే రష్యా చర్చల కోసం ఈ కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. అందుకే రష్యా ఇలా సంప్రదింపులకు సిద్ధమైనట్లు సమాచారం.
Tags:    

Similar News