అగ్రరాజ్యాలు బరిలోకి దిగాయి

Update: 2015-11-19 04:26 GMT
దశాబ్దాలుగా ఉగ్రవాదం మీద భారత్ నెత్తి నోరు కొట్టుకున్నా పట్టించుకున్నది లేదు. తమ మీద తరచూ జరుగుతున్న దాడులకు కారణంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అని ఆధారాలు చూపించినా పెద్దగా స్పందించని అగ్రరాజ్యాలు.. ఇటీవల ఫ్రాన్స్ రాజధాని ఫ్యారిస్ నగరం మీద ఉగ్రపంజా పడిన వెంటనే.. విలవిలలాడిపోయారు. ఆధారాలు.. సాక్ష్యాలు అన్న మాటల్ని బయటకు తీయకుండా.. తమ యుద్ధ విమానాల్ని బయటకు తీశారు.

తమ దేశం మీద జరిగిన ఉగ్రదాడిని.. యుద్ధంగా ప్రకటించిన దేశాధ్యక్షుడి మాటకు తగ్గట్లే.. వెనువెంటనే వార్ జెట్ లు రంగంలోకి దిగి.. సిరియాలోని ఐఎస్ ఎస్ తీవ్రవాదుల రాజధాని నగరమైన రక్కాపై విరుచుకుపడ్డాయి. సిరియాలోని తమ రాజధానిగా ప్రకటించిన ఐసిస్ కు భారీ దెబ్బ తగిలేలా చేయటంతో పాటు.. వారి ఆయుధగారంతో పాటు.. ఆర్థిక మూలాలు ఉన్న రక్కా సిటీ మీద భారీ దాడులకు పాల్పడ్డారు.

గత మూడు.. నాలుగు రోజులుగా జరుపుతున్న విమానదాడులతో రక్కా నగరాన్ని ఫైటర్ జెట్లు కూల్చేశాయి. ఈ విషయాన్ని ఫ్రాన్స్ సైతం స్పష్టం చేసింది. రక్కా సిటీలో ఏర్పాటు చేసుకున్న ఐసిస్ స్థావరాల్ని.. ఆయుధ కర్మాగారాల్ని శక్తివంతమైన బాంబులతో దాడి చేసి.. ఒక కొలిక్కి తీసుకొచ్చాయి. తాజాగా జరిపిన దాడుల కారణంగా.. రక్కా నగరం కూలిపోవటంతో పాటు.. ఐసిస్ తీవ్రవాదులకు కోలుకోలేనంత దెబ్బ తగిలినట్లుగా విశ్లేషిస్తున్నారు.

ఫ్రెంచ్.. రష్యాకు చెందిన సంయుక్త బలగాలు ఉత్తర సిరియాపై ముప్పేట దాడి నిర్వహించి ఐసిస్ ఆయువు పట్టుపై భారీగా దెబ్బ కొట్టాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా జరిపిన దాడుల్లో దాదాపు 33 మంది జిహాదీలు మరణించి ఉంటారన్నది ఒక అంచనా. ఇదిలా ఉంటే.. ఐసిస్ కు బలమైన రక్కా పట్టణం పూర్తిగా ధ్వంసమైందని చెబుతున్నారు. ఐసిస్ స్థావరాలు.. ఆయుధ కర్మాగారం.. శిక్షణ కేంద్రాలు.. చెక్ పాయింట్లు పూర్తిగా ధ్వంసమైనట్లుగా భావిస్తున్నారు. తాజాగా జరిపిన దాడులు ఐసిస్ కోలుకోలేనంతగా దెబ్బ తిన్నాయని చెబుతున్న మాటలు ఎంతవరకు నిజమన్నది తేలాల్సి ఉంది. గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఒక అగ్రరాజ్యం ఉగ్రవాద దాడికి గురైతే వెనువెంటనే స్పందించే తీరుకు.. ఒక వర్ధమాన దేశంలో జరిగే ఉగ్రవాద దాడికి రియాక్ట్ అయ్యే తీరుకు ఎంత వ్యత్యాసం ఉంటుందో తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పొచ్చు.
Tags:    

Similar News