కోల్డ్ వార్ -2 నుంచి థర్డ్ వరల్డ్ వార్ దిశగా..

Update: 2016-10-08 11:13 GMT
 ప్రచ్ఛన్న యుద్ధం నాటి పరిస్థితులు ఈ తరానికి తెలియకపోయినా మన ముందు తరానికి చాలావరకు తెలుసు. రష్యా - అమెరికాలు అగ్రరాజ్యాలుగా చెలమణీ కావడానికి - ప్రపంచంపై పెత్తనం పెంచుకోవడానికి సాగించిన అంతర్జాతీయ రాజకీయ క్రీడలో ఎన్నో దేశాలు సమిధలయ్యాయి. ఆర్థికంగా - సామాజికంగా చితికిపోయాయి. ప్రజలకెప్పుడూ ప్రాణభీతి వెంటాడేది. మళ్లీ అలాంటి రోజులు సమీపిస్తున్నాయి. అమెరికా - రష్యాల మధ్య మళ్లీ ఆ స్థాయిలో విభేదాలు పొడచూపుతుండడంతో పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా చమురు దేశాలు - పేద దేశాలకే తప్ప యుద్ధం - అంతర్యుద్ధం సెగ అభివృద్ధి చెందిన దేశాలకు తగలలేదు. గుత్తాధిపత్యం కోసమో... శాంతి పేరుతోనే.. తాము సృష్టించిన సమస్యలను తామే పరిష్కరించడం కోసమో.. ఇంకా చెప్పాలంటే నోబెల్ శాంతి బహుమతి పొందాలనే ఆశతోనే జోక్యం పేరుతో పలు దేశాలపై అమెరికా, దాని మిత్ర దేశాలు దాడులు చేశాయి. అమెరికా వంటి దేశాలపై ఉగ్రదాడులు జరుగుతున్నా ఏ దేశమూ ప్రత్యేకంగా యుద్ధం మాత్రం ప్రకటించలేదు. ఉత్తర కొరియా.. ఇప్పుడు ఫిలిప్పీన్సు వంటివి అమెరికాను బెదిరిస్తున్నా యుద్ధం వరకు మాత్రం వెళ్లలేదు. చైనా  - అమెరికాల మధ్యా ఆధిపత్య పోరు - మార్కెట్ పోరు కారణంగా తీవ్ర విభేదాలున్నా అవి తెర వెనుక జరిగే తంతే కానీ ప్రత్యక్షంగా నీ అంతు చూస్తానంటే నీ అంతు చూస్తాననే వరకు వెళ్లలేదు. రష్యాతోనూ అమెరికా సంబంధాలు కొద్దికాలంగా అలాగే ఉన్నాయి. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం వంటి అంశాల్లో రెండూ కాట్లాడుకుంటున్నా బయటకొచ్చి బాహాబాహీకి దిగింది లేదు. కానీ... తాజాగా పరిస్థితులు మారుతున్నాయి. రష్యా అమెరికాతో యుద్ధానికి సిద్ధమవుతోందని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు.  అమెరికా గగనతలం సరిహద్దుల్లో.. ప్రచ్ఛన్న యుద్ధ కాలంనాటి గస్తీ ప్రాంతాల్లో అత్యంత శక్తిమంతమైన న్యూక్లియర్‌ బాంబర్లను రష్యా ఇప్పటికే మోహరించిందని అంటున్నారు. మధ్యధరా సముద్రంలో కూడా న్యూక్లియర్ అటాక్ కెపాసిటీ ఉన్న రెండు యుద్ధనౌకలను కూడా పంపినట్లు వార్తలొస్తున్నాయి.

అమెరికా - రష్యాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడానికి సిరియా విషయంలో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడమే కారణం. సిరియాలో బషర్‌ అసద్‌ ప్రభుత్వానికి రష్యా మద్దతు ఇస్తుండగా.. తిరుగుబాటుదారులకు అమెరికా మద్దతు ఇస్తోంది. ఇటీవల సిరియాలోని అలెప్పో నగరంలో పౌరులపై బాంబుదాడులు జరిగిన నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌ కెర్రీ రష్యాను ఉద్దేశించి.. యుద్ధ నేరాలకు పాల్పడేవారు అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. రష్యా త్వరలో నాటో దేశాలపై భయంకరమైన అణు దాడి చేయబోతోందని పెంటగాన్‌ చీఫ్‌ కొద్దిరోజుల క్రితమే హెచ్చరించారు.  దీనికి తగ్గట్టుగానే.. రష్యాకు చెందిన రెండు ఎస్‌-యూ ఫైటర్‌ జెట్లు ఇటీవల ఫిన్‌లాండ్‌ గగనతలంలోకి ప్రవేశించాయి. రెండు బ్లాక్‌ జాక్‌ బాంబర్లు స్కాట్‌ లాండ్‌ లో విహరించాయి. నార్వే నుంచి రెండు బ్లాక్‌ జాక్‌ బాంబర్లు ఉత్తర స్పెయిన్‌ దిశగా ఎగిరాయి. ఆ వెంటనే నాటో జెట్‌ విమానాలు రష్యా బ్లాక్‌ జెట్స్‌ ను అడ్డుకున్నాయి. నాటో ఇలా అడ్డు తగిలేకొద్దీ... రష్యా మరింతగా రెచ్చిపోతోందని, మరిన్ని విమానాలను పంపిస్తోంది.

మరోవైపు అమెరికా పలు ఇతర దేశాలను రష్యాపైకి ఉసిగొల్పుతుండడమూ ఆ దేశానికి కోపం తెప్పిస్తోంది. ఉక్రెయిన్ విషయంలో తెర వెనుక ఉండి రష్యాను ఇబ్బందులు పెట్టింది అమెరికానే. అంతేకాదు.. సిరియ విషయంలో విభేదాలుండగా రష్యా విమానాలు - హెలికాప్టర్లను అమెరికా అనుకూల టర్కీ గతంలో కూల్చివేయడమూ వివాదమైంది. ఈ నేపథ్యంలోనే రష్యా అమెరికాతో అమీతుమీ తేల్చుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. యుద్ధ సన్నాహాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు చైనా కూడా అమెరికా బలుపును అణచాలని చాలాకాలంగా చూస్తోంది. అమెరికా ఇండియాకు దగ్గరవుతుంటే చైనా పాక్ కు దగ్గరవుతోంది. రష్యా కూడా పాక్ కే చేరువవుతోంది.  ఆ రెండు దేశాల మధ్య రక్షణ సహకారం పెరిగింది. నిజంగా అమెరికాపై రష్యా యుద్ధానికి దిగితే చైనా, ఉత్తర కొరియా వంటివి వెంటనే మద్దతు ఇస్తాయని భావిస్తున్నారు. అంతర్జాతీయ సమాజానికి గౌరవమిచ్చే రష్యా సంగతి ఎలా ఉన్నా ఉత్తర కొరియా కనుక రంగంలోకి దిగితే అమెరికా వినాశనం తప్పదు. ఎటొచ్చీ ఇదంతా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News