ప్రపంచం షాక్ తినేలా చేసిన ఆ చిత్ర బృందం

Update: 2021-10-06 04:00 GMT
సినిమా రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రేక్షకుడికి థ్రిల్ కలిగించేందుకు ఇప్పటివరకు ఎప్పుడూ చేయని పనులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కోసారి సాహసాలుగా మారినా.. అవి కొత్త అడుగులు వేసేందుకు మరికొందరికి స్ఫూర్తినిచ్చేలా మారుతున్నాయి. రాజమౌళి బాహుబలి తీసే వరకు.. తెలుగు సినిమా ఎంత భారీ కలెక్షన్లను సొంతం చేసుకోవచ్చన్న ఊహ ఏ దర్శకుడికైనా కలిగిందా? సరిగ్గా.. ఈ తీరులోనే రష్యాకు చెందిన ఒక చిత్ర బృందం ‘అంతకు మించి’ అన్న రీతిలో ఆలోచించింది. ప్రపంచం మొత్తం విస్తుపోయే సాహసాన్ని చేపట్టి.. ఔరా అనుకునేలా చేయటమే కాదు.. ఇప్పుడా సినిమా కోసం యావత్ ప్రపంచం ఎదురుచూసేలా చేసింది. ఇంతకూ వారు చేసిందేమంటే.. సినిమా షూటింగ్ కోసం ఏకంగా అంతరిక్ష్యానికి ప్రయాణం కట్టటం.

ఇదే విషయాన్ని నాసా కూడా తెలియజేసింది. ఇప్పటివరకు వేసుకున్న ప్లాన్.. షెడ్యూల్ ప్రకారం 35 నుంచి 40 నిమిషాల షూటింగ్ కోసం  అంతరిక్షంలో 12 రోజుల పాటు షూటింగ్ చేసేందుకు వీలుగా సన్నాహాలు చేసుకోవటమే కాదు.. తాజాగా కజికిస్తాన్ నుంచి ఈ టీం అంతరిక్ష ప్రయాణానికి వెళ్లింది  కూడా.

రష్యా దర్శకుడు క్లిమ్ షిపెంకో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పేరు..  ‘ది చాలెంజ్‌’. చిత్ర కథకు వస్తే.. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఓ వ్యోమగామిని రక్షించేందుకు ఒక మహిళా డాక్టర్ అంతరిక్షంలోకి వెళుతుంది. కథ డిమాండ్ చేయటం.. వాస్తవానికి దగ్గరగా ఉండేందుకు వీలుగా.. అంతరిక్షంలో చేపట్టాల్సిన సీన్లను.. నిజంగానే అంతరిక్షంలో చేసేందుకు వీలుగా దర్శకుడు క్లిమ్ షిపెంకో.. నటి యూలియా పెరిస్లిడ్.. వీరికి సహకారం అందించేందుకు వీలుగా అంతరిక్ష యాత్రికుడు అంటోనీ షకాప్లెరేవ్ కలిసి వెళ్లారు.

కజికిస్తాన్ లోని బైకనూర్ కాస్మో డ్రోమ్ నుంచి సూయోజ్ ఎంఎస్ 19 వ్యోమనౌకలో బయలుదేరారు. పన్నెండు రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి.. తాము అనుకున్న సీన్లను అంతరిక్షంలోనే చిత్రీకరించనున్నారు. ఈ సంచలన విషయాన్ని నాసా తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో తెలియజేసింది. దీంతో.. యావత్ ప్రపంచం విస్తుపోయేలా చేయటమే కాదు.. ఔరా సినిమా షూటింగ్ కోసం ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లటమా? అని ముక్కున వేలేసుకునేలా చేసింది.

ఇక.. అంతరిక్షంలో షూటింగ్ లో భాగంగా 35 నిమిషాల పాటు చిత్రీకరణ చేటం.. మధ్యలో బ్రేక్ తీసుకోవటం.. మళ్లీ షూటింగ్ చేయటం చేస్తారు. ఇలా పన్నెండు రోజుల పాటు ఏమేం చేయాలన్న పక్కా ప్లాన్ తో ఈ మూవీ టీం వెళ్లింది. ప్రపంచ చరిత్రలో ఒక సినిమా షూటింగ్ కోసం అంతరిక్షంలోకి వెళ్లిన మూవీగా ఈ రష్యా మూవీ నిలిచిపోవటమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మీద ఆసక్తి వ్యక్తం కావటం ఖాయం. తొలిసారి మనిషిని అంతరిక్షంలోకి పంపిన ఘనతను ఇప్పటికే తన పేరుతో రికార్డును రాసుకున్న రష్యా.. తాజా ఫీట్ ను చేస్తుండడటం గమనార్హం. ఇంతటి సాహసానికి సిద్ధమైన ఈ సినిమా టీంకు అభినందనలు తెలియచేయాల్సింది.
Tags:    

Similar News