ఇండియా అత్త.. రష్యా కోడలి రచ్చ క్లోజ్

Update: 2016-07-11 09:31 GMT
అందరి దృష్టిని ఆకర్షించిన ఇండియా అత్త.. రష్యా కోడలు వ్యవహారం ముగించింది. తనకు జరిగిన అన్యాయంపై భర్తతో కలిసి ఇండియా అత్తపై రష్యా కోడలు చేసిన నిరసనకు విదేశాంగ శాఖ స్పందించటంతో పాటు.. యూపీ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం రియాక్ట్ కావటంతో కథ కంచికి చేరింది. అగ్రాకు చెందిన విక్రాంత్ సింగ్ అనే వ్యక్తి 2011లో రష్యాకు చెందిన ఓల్గాని పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కొడుకు పుట్టాడు. వివాహం తర్వాత ఈ దంపతులు అగ్రాను విడిచి పెట్టి గోవాలో స్థిరపడ్డారు. అక్కడే వ్యాపారం ఒకటి షురూ చేశారు.

ఇక్కడే బొమ్మ అడ్డం తిరిగింది. వ్యాపారం నష్టాలు రావటంతో వారు గోవాను విడిచి పెట్టి.. అగ్రాకు చేరుకున్నారు. తన అత్త తన ఆస్తిలో భర్తకు వాటా ఇవ్వకుండా కూతురికే ఆస్తిని కట్టబెడుతుందన్నది రష్యా కోడలి వాదన. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అయితే.. సివిల్ మ్యాటర్ కావటంతో వారు తల దూర్చేందుకు సాహసించలేదు. ఇక.. లాభం లేదనుకున్న ఈ రష్యా కోడలు తన భర్త.. పిల్లాడ్ని తీసుకొని అత్త ఇంటి ముందు ధర్నా చేపట్టింది. అంతేకాదు.. తనకు జరిగిన అన్యాయంపై రష్యా దౌత్యాధికారులకు ఫిర్యాదు చేసింది.

మరోవైపు ఈ వ్యవహారంపై ఇండియా అత్త స్పందిస్తూ.. గతంలో తన కొడుక్కి రూ.11 లక్షలు ఇచ్చానని.. దాన్ని పాడు చేశారని చెబుతోంది. తన ఇంటిని తన కూతురికి ఇచ్చేశానని చెబుతోంది. ఇదిలా ఉంటే.. రష్యాలోని తన తల్లిదండ్రులు పేదవారని.. వారు ఆస్తి ఏమీ ఇవ్వలేరని.. తమ పెళ్లి తర్వాత పుట్టింటి నుంచి ఆస్తి తీసుకురావాలంటూ తన అత్తి తనను తరచూ కోరేదని ఈ రష్యా కోడలు ఆరోపిస్తోంది. అత్తారింటి ముందు ఆమె చేసిన దీక్ష హాట్ టాపిక్ గా మారి విదేశాంగ శాఖ వరకూ వెళ్లింది.

కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయం మీద రియాక్ట్ అయ్యారు. ఈ అంశం మీద ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తో మాట్లాడారు. దీంతో ఆయన జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా ఇష్యూలోకి రావటం.. ఇరు వర్గాల్ని కూర్చోబెట్టి అధికారులు చేసిన రాజీ సానుకూల ఫలితాల్ని ఇచ్చింది. దీంతో ఇండియా అత్తపై రష్యా కోడలి పోరు ముగిసింది. ఈ అంశంపై తాజాగా రియాక్ట్ అయిన కేంద్రమంత్రి సుష్మా.. యూపీ సీఎంకు థ్యాంక్స్ చెప్పారు. ఆయన స్పందించిన వైనాన్ని ప్రశంసించిన సుష్మా.. ఇలాంటి ఘటనలు భారత్ ఇమేజ్ ను దెబ్బ తీస్తాయని వ్యాఖ్యానించారు. మొత్తంగా గత రెండు రోజులుగా జాతీయ మీడియాలో వార్తాంశం ఇక ముగిసినట్లే.
Tags:    

Similar News