రష్యా నోట మళ్లీ మూడో ప్రపంచ యుద్ధం మాట.. ఉక్రెయిన్ పై ఓటమితో ఉక్రోశం?

Update: 2022-04-26 13:30 GMT
మొదట సైనిక చర్య అన్నది.. ఉక్రెయిన్ లోని సైనిక స్థావరాలే లక్ష్యమని చెప్పింది.. ప్రజల జోలికి వెళ్లమని పేర్కొంది.. రోజుల వ్యవధిలో పొరుగు దేశాన్ని కబళించేయవచ్చు అనుకుంది.. కానీ.. రెండు నెలల రెండు రోజులైంది.. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్ పరిసరాల నుంచి వెళ్లిపోయింది.. తమకు అనుకూల వాతావరణం ఉన్న తూర్పు ప్రాంతాలపై కన్నేసింది. మరోవైపు ఉక్రెయిన్ కు అమెరికాతో పాటు పశ్చిమ దేశాల పూర్తి సహకారం అందింది.

ఆయుధాలు, డబ్బుతో పాటు నైతిక మద్దతు కొనసాగుతోంది. దీంతో రష్యా ప్రస్తుతం ఏంచేయాలో పాలుపోని స్థితిలో ఉంది. ఇప్పటికే అమెరికా ఆయుధ సాయంపై మండిపడుతున్న రష్యా.. తాజా మూడో ప్రపంచ యుద్ధమే అంటూ నిప్పులు కక్కింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందిస్తూ సహాయం చేయడం అంటే మూడో ప్రపంచ యుద్ధం ముప్పు 'వాస్తవం' అంటూ హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు భారీ స్థాయిలో ఆయుధాలను సరఫరా చేసేందుకు అమెరికా దాని మిత్రదేశాలు సిద్ధమవుతోన్న వేళ రష్యా ఈ విధంగా స్పందించింది.

అప్పుడు అణు హెచ్చరిక

యుద్ధం మొదలైన తొలి పది రోజుల్లో రష్యా అందరినీ ఆశ్చర్యపరుస్తూ అణు హెచ్చరిక చేసింది. అణు  బలగాలను హై అలర్ట్ చేసి వణికించింది. మధ్యలోనూ ఓసారి అణుమానాలు రేకెత్తేలా వ్యవహరించింది. ఈలోగా ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతాల నుంచి  వెళ్లిపోయింది. ఇప్పుడు తాజాగా మూడో ప్రపంచ యుద్ధం అంటోంది.

మేం అలసిపోలేదు..

'మూడో ప్రపంచ యుద్ధం ఎట్టిపరిస్థితుల్లోనూ కోరుకోవడం లేదని ప్రతిఒక్కరూ మంత్రాలు పఠిస్తున్నారు. అవసరమైనప్పుడు కాకుండా కృత్రిమంగా సృష్టిస్తోన్న అణు సంఘర్షణ ప్రమాదాలు తీవ్రంగా ఉంటాయి. అది వాస్తవం. దానిని మీరు తక్కువగా అంచనా వేయొద్దు' అంటూ రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగించాలని పాశ్చాత్య దేశాలు కోరుకుంటున్నాయన్న ఆయన.. రష్యా సేనలు అలసిపోయినట్లు భావిస్తుండడం కూడా ఒక భ్రమే అన్నారు. రష్యాను ఉక్రెయిన్‌ నాయకులు రెచ్చగొడుతున్నారని, నాటో బలగాలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయని ఆరోపించారు.

ఇక రష్యా వ్యాఖ్యలపై ఉక్రెయిన్‌ స్పందించింది.'మాకు మద్దతు ఇవ్వకుండా ప్రపంచ దేశాలను భయపెట్టాలని చూసిన రష్యా.. చివరకు ఆశలు కోల్పోయింది. అందుకే మూడో ప్రపంచ యుద్ధం ముప్పు వాస్తవం అంటూ బెదిరిస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఓటమిని గ్రహించినట్లు అర్థమవుతోంది'అని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా పేర్కొన్నారు. ఇదిలాఉంటే, రష్యా సైనికచర్యతో అల్లాడుతోన్న ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు పశ్చిమ దేశాలు ముందుకు వస్తున్నాయి. నేరుగా బలగాలను పంపించేందుకు నిరాకరిస్తున్నప్పటికీ ఆయుధ సామగ్రిని అందిస్తున్నాయి.

తాజాగా ఉక్రెయిన్‌లో పర్యటించిన అమెరికా విదేశాంగ, రక్షణశాఖ మంత్రులు కూడా భారీ స్థాయితో ఆయుధ సహకారం అందిస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడంపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ నాటో దేశాలు ఉక్రెయిన్‌కు భారీ స్థాయిలో ఆయుధాలు సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఓవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో అమెరికా మంత్రుల రహస్య భేటీ జరగడం, మరోవైపు రష్యా సరిహద్దు ప్రాంతంలో క్షిపణి దాడులు జరుగుతుండడంతో మూడో ప్రపంచ యుద్ధ ముప్పు అంటూ రష్యా మరిన్ని హెచ్చరికలు చేస్తోంది.
Tags:    

Similar News