మోదీ ‘స్వశక్తి’ పై.. శివసేన అదిరిపోయే పంచ్

Update: 2020-05-14 15:10 GMT
ప్రాణాంతక వైరస్ కరోనా కట్టడి నేపథ్యంలో సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్థిక రంగానికి కొత్త జవసత్వాలను నింపేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల రెండో విడత ఆర్థిక ప్యాకేజీపై విమర్శల జడివాన కురుస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం రాత్రి మోదీ ప్యాకేజీ ప్రకటిస్తే.. బుధవారం నాడు బీజేపీ వైరివర్గాలు తమదైన శైలిలో విమర్శలు కురిపించాయి. తాజాగా గురువారం మోదీ ప్యాకేజీపై సోషల్ మీడియా వేదికగా మీమ్స్ తో కూడిన సెటైరకల్ దాడులు కూడా షురూ అయ్యాయి. ఈ మీమ్స్ దాడుల్లో బీజేపీ పాత మిత్రుడు, ఇప్పుడు కాంగ్రెస్ తో జోస్తీ కట్టిన మరాఠా పార్టీ శివసేన తనదైన శైలిలో మోదీ ప్యాకేజీపై సెటైరికల్ దాడులు చేసింది. తన అధికారిక పత్రిక సామ్నా ఎడిటోరియల్ లో మోదీ ప్యాకేజీని శివసేన తూర్పారబట్టేసింది. ప్రత్యేకించి మోదీ నోట వినిపించిన ‘స్వశక్తి’ని టార్గెట్ చేసిన సామ్నా... మీమ్స్ తరహా విమర్శలు గుప్పించింది.

కరోనా కలకలం నేపథ్యంలో మన ఆర్ధిక వ్యవస్థలను కాపాడుకునేందుకు స్వశక్తి మీదనే ఆధారపడాలంటూ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలనే టార్గెట్ చేసిన శివసేన... అదేంటీ మనం ఇప్పటిదాకా స్వశక్తి మీదనే కదా ఆధారపడి ముందుకు సాగుతున్నది అంటూ మోదీని దెప్పిపొడిచింది. కరోనా వేళ సామాన్యుడికి భరోసా కల్పించాల్సిన మోదీ సర్కారు... పరిశ్రమలు, విద్యుత్ సంస్థలకు రాయితీల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని సామ్నా డైరెక్ట్ గానే మోదీపై విరుచుకుపడింది. భారత్ స్వశక్తిపై ఆధారపడటం ఏమిటి? ఇప్పుడు మనం స్వశక్తి మీద ఆధారపడిలేమా? అంటూ సామ్నా ఎడిటోరియల్ కధనం ప్రధానిని తనదైన శైలిలో టార్గెట్ చేసింది.

స్వాతంత్య్రానికి పూర్వం మన దేశానికి గుండు సూదిని సైతం తయారు చేసే సామర్థ్యం లేదని, కానీ ఈ అరవై ఏళ్లలో శాస్త్ర సాంకేతిక, వ్యవసాయ, రక్షణ, వ్యాపార, తయారీ, అణుశక్తి రంగాల్లో స్వశక్తిపైనే ఆధారపడేలా ఎదిగిందని కూడా సామ్నా పత్రిక మోదీ సర్కారుకు గుర్తు చేసింది. వ్యాపారులు పెట్టుబడులు పెట్టాలంటే... పర్యావరణ అనుకూలంగా దేశాన్ని మార్చాలని కూడా ఆ పత్రిక కేంద్రానికి సూచించింది. లాక్ డౌన్ 4కు వెళుతున్నా... ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినా కూడా స్టాక్ మార్కెట్లు ఎందుకు కోలుకోవడం లేదని కూడా ఆ పత్రిక కేంద్రాన్ని కాస్తంత సూటిగానే ప్రశ్నించింది. చివరగా రాజీవ్ గాందీ సాంకేతిక విప్లవానికి పునాదులు వేయకపోయి ఉంటే.. ఇప్పుడు ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడే వీలు కూడా ఉండేది కాదని కూడా సామ్నా ఒకింత ఘాటుగానే మోదీ సర్కారును ఏకేసింది. మొత్తంగా గతంలో బీజేపీతో కలిసి సుదీర్ఘ ప్రస్థానం సాగించిన శివసేన నుంచే ఈ తరహాలో విమర్శలు రావడం మోదీకి మింగుడు పడనిదేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News