విశాఖను రక్షించుకునే ఆఖరి ఛాన్స్ ఇదే.. సబ్బం సంచలనం

Update: 2021-03-10 05:30 GMT
మాజీ ఎంపీ.. సీనియర్ రాజకీయ నేత సబ్బం హరి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ.. విశాఖలో ఆయన మాట్లాడారు. విశాఖపట్టణాన్ని రక్షించుకునేందుకు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచి పెట్టొద్దని ఆయన చెప్పారు. ఇప్పుడొచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకపోతే.. విశాఖను రక్షించుకోవటం కష్టమని విశాఖ వాసులకు స్పష్టం చేశారు.

మీరే కనుక రేపటి ఎన్నికల్లో కులానికో.. మరేదానికో లొంగిపోతే.. విశాఖ కూడా మమ్మల్నే గెలిపించిందని వైసీపీ వాళ్లు విర్రవీగుతారు. ఇంకెవరూ మాట్లాడటానికి లేదంటారు. మీరెన్ని చెప్పినా ప్రజలు నాకే ఓట్లేశారని చెప్పి.. ఇంకా ఆరాచకాలకు పాల్పడే అవకాశం ఉంది. అందుకే.. మీ ఓటుతో తీర్పును ఇవ్వండన్నారు.

స్టీల్ ప్లాంట్ అమ్మేసినా.. పోలవరం ఎత్తు తగ్గించినా..ఏం చేసినా తమకేం కాదని చెబుతారని.. అందుకే తాజాగా జరిగే ఎన్నికల్లో విశాఖ వాసులు తమ నిర్ణయాన్ని కుండబద్ధలు కొట్టాలని పిలుపునిచ్చారు. ‘ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే.. విశాఖను రక్షించుకోవటం కష్టం. మీ తీర్పుతో వాళ్లకు కళ్లు తెరిపించాలి. ఇది జరిగిన తర్వాత నెత్తి నోరు కొట్టుకున్నా ఇంకేమీ ఉండదు’ అంటూ విశాఖ వాసుల్ని ఉద్దేశించి సబ్బం హరి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మరి.. ఆయన మాటలకు విశాఖ వాసులు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News