ఉత్త‌మ్‌ - జానాల‌కు షాకిచ్చిన స‌బితా

Update: 2018-11-05 10:53 GMT
ఇంకా ఎన్నిక‌లు జ‌ర‌గ‌నే లేదు. క‌నీసం నామినేష‌న్ల‌యినా వెయ్య‌నే లేదు. ఇప్పుడు కాంగ్రెస్‌లో కుర్చీలాట మొదలైన‌ట్లు క‌నిపిస్తోంది. మాజీ హోంమంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తాజాగా ఓ ప్ర‌చార స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నం. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మ‌హా కూట‌మి విజ‌యం సాధిస్తే తానే సీఎంన‌వుతాన‌ని ఆమె వ్యాఖ్యానించారు. త‌ద్వారా టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మ‌రో సీనియ‌ర్ నేత జానారెడ్డికి ఆమె షాకిచ్చారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఎప్పుడూ స‌బితా ఇంద్రారెడ్డిని త‌న‌కు దేవుడిచ్చిన చెల్లిగా చెప్పేవారు. అందుకే ఆయ‌న ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టాక పార్టీలో చాలామంది సీనియ‌ర్ల‌ను తోసిరాజ‌ని.. స‌బిత‌కు కీల‌క‌మైన‌ హోంమంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. అయితే - తెలంగాణ ఆవిర్భావం అనంత‌రం ప‌రిస్థితులు మారిపోయాయి. గ‌త ఎన్నిక‌ల్లో మ‌హేశ్వ‌రంలో పోటీకి దూరంగా ఉన్న స‌బిత‌.. ప్ర‌స్తుతం మ‌ళ్లీ ఆ స్థానంలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నారు.

మ‌హా కూట‌మిలో సీట్ల పంప‌కం ఇప్ప‌టికీ పూర్తి కాకున్నా.. త‌న‌కే టికెట్ ద‌క్కుతుంద‌న్న ధీమాతో స‌బిత ప్ర‌చార ప‌ర్వాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగానే తాజాగా ఆమె ఓ ప్ర‌చార స‌భ‌లో మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌హా కూట‌మి అధికారంలోకి వ‌స్తే తానే రాష్ట్ర ముఖ్య‌మంత్రిన‌వుతాన‌ని పేర్కొన్నారు. మ‌హేశ్వ‌రంలో తాను ల‌క్ష ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధిస్తాన‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.

స‌బిత వ్యాఖ్య‌లు ప్రస్తుతం కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి. ప్ర‌ధానంగా టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మ‌రో సీనియ‌ర్ నేత జానారెడ్డి ఆమె వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. హోంమంత్రి ప‌ద‌వి నుంచి దిగిపోయాక చాన్నాళ్లూ రాజ‌కీయాల్లో చురుగ్గా లేని స‌బిత ఇప్పుడొచ్చి సీఎం పీఠం త‌న‌దేన‌ని చెప్ప‌డ‌మేంట‌ని కాంగ్రెస్‌లోని ఇత‌ర నాయ‌కులూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ముందు ఎన్నిక‌ల్లో మ‌హా కూట‌మికి విజ‌యం ద‌క్కేలా చూడాల‌ని.. సీఎం పీఠం ఎవ‌రిద‌నే విష‌యంపై ఆ త‌ర్వాతే చూసుకోవ‌చ్చ‌ని వారు సూచిస్తున్నారు.


Tags:    

Similar News