మ‌హాకూట‌మి పొత్తు..చేవెళ్ల చెల్లెమ్మ‌ ఇంట్లో చిచ్చు

Update: 2018-11-15 12:57 GMT
చేవెళ్ల చెల్ల‌మ్మ‌గా తెలుగు రాష్ర్టాల్లో సుప‌రిచితురాలైన మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంట్లో మ‌హాకూట‌మి క‌ల‌క‌లం సృష్టించింది. మహాకూటమి పొత్తు..కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనాలు సృష్టిస్తున్న సంగ‌త తెలిసిందే. పొత్తులో భాగంగా తమకు సీటు రాలేదని భావిస్తున్న సదరు నేతలు పార్టీకి గుడ్ బై చెబుతుండ‌గా తాజాగా మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి కూడా చేరారు. ఈయన రాజేంద్రనగర్ సీటు ఆశించిన సంగతి తెలిసిందే. మహా కూటమి పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీకి దక్కింది. మనస్థాపానికి గురైన ఆయన పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు నవంబర్ 15వ తేదీ గురువారం ప్రకటించారు. రాజీనామా లేఖను ఆయన పార్టీ చీఫ్‌ కి పంపించారు. ఆయనతో పాటు ఇతర నేతలు రాజీనామా చేస్తున్నారని సమాచారం.
 
శంషాబాద్‌ లోని ఓ ప్రైవేట్ ఫంక్ష‌న్ హాల్లో కార్య‌క‌ర‌త్ల స‌మావేశం ఏర్పాటుచేసి కార్తీక్ రెడ్డి అనంత‌రం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, కాంపైన్ కమిటీ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. ``నాతో పాటు ఎంపీటీసీలు - జెడ్పీటీసీలు - ఇతర నాయకులు అంతా రాజీనామా చేస్తున్నాం. బీ -ఫాం నాకు రాలేదంటే మా రాజీనామాలు ఆమోదం పొందినట్లే. నాకు టికెట్ రాదని టీఆర్ ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ నెల నుంచి ప్రచారం చేస్తున్నారు. కానీ  కాంగ్రెస్ పార్టీపై విశ్వాసంతో ఉన్నా నేను నమ్మలేదు. కానీ నిన్న రెండో జాబితాలో టీడీపీ రాజేంద్రనగర్ అభ్యర్థి ప్రకటించటం..టీఆర్ ఎస్ శ్రేణులు టపాకులు కాల్చుకోవ‌డం చూస్తుంటే...ఇదే స్ప‌ష్ట‌మైంది. తెలంగాణ టీడీపీ అధ్య‌క్షుడు ఎల్.రమణ టికెట్లు అమ్ముకున్నారు`` అని మండిప‌డ్డారు.

రాజేంద్రనగర్ నియోజకవర్గం టికెట్ ఆయన ఆశించినప్పటికీ.. ఆ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో కార్తీక్ రెడ్డి  తీవ్ర మనస్తాపానికి గురైనట్లు స‌మాచారం. తన రాజీనామాను ఆమోదిస్తారా? లేక రాజేంద్రనగర్ టికెట్ ఇస్తారా? అనే విషయం చెప్పాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని కార్తీక్ రెడ్డి డిమాండ్ చేశారు.భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామన్న కార్తీక్ రెడ్డి.. టీడీపీ అభ్యర్థి కోసం పని చేయడం తమకు ఇష్టం లేదన్నారు. ఎవరి ఓట్లతో టీడీపీ గెలుస్తుందని కార్తీక్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా కార్తీక్‌ రెడ్డి నిన్న నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి మహేశ్వరం నియోజకవర్గం టికెట్‌ ను కేటాయించిన సంగ‌తి తెలిసిందే.


Tags:    

Similar News