చిరు-స‌చిన్ ల‌కు పెద్ద‌ల స‌భ‌లో మ‌రో చాన్స్ ఇస్తారా?

Update: 2018-02-04 09:07 GMT

భార‌త‌దేశ పార్ల‌మెంటులోని లోక్ స‌భ స‌భ్యుల ప‌దవీకాలం 5 సంవత్స‌రాల‌ని, రాజ్య‌స‌భ స‌భ్యుల ప‌దవీ కాలం 6 సంవ‌త్స‌రాల‌న్న సంగతి తెలిసిందే. అయితే, లోక్ స‌భ‌కు ప్ర‌తి ఐదేళ్ల‌కు ఓ సారి ఎన్నిక‌లు జ‌రుగుతుంటే....రాజ్య‌స‌భ‌కు ప్ర‌తి ఆరు సంవ‌త్స‌రాల‌కోసారి ఎన్నిక‌లు జ‌రుగుతాయి. లోక్ స‌భ ప్రతి ఐదేళ్ల కోసారి డిజాల్వ్ అవుతుంది....అయితే, రాజ్య స‌భ స‌భ్యులలో 1/3వ వంతు మంది సభ్యులు ప్ర‌తి రెండేళ్ల‌కోసారి రిటైర్ అవుతుంటారు....వారి స్థానాల్లో కొత్త స‌భ్యులు వ‌స్తుంటారు. ఈ నేప‌థ్యంలో, ఈ ఏడాది కూడా కొంద‌రు రాజ్య స‌భ సభ్యుల ప‌దవీకాలం ముగియ‌నుంది. వారిలో సినీన‌టుడు చిరంజీవి, బాలీవుడ్ న‌టి రేఖ‌ - లెజెండ‌రీ క్రికెట‌ర్ స‌చిన్ ల‌తో పాటు ప‌లు రాజ‌కీయ పార్టీల‌కు చెందిన హేమాహేమీలున్నారు. అయితే, వీరిలో ఎవ‌రు మ‌ళ్లీ రాజ్య స‌భ సీటు ద‌క్కించుకుంటారో అన్న సంగతి ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ ఏడాది ఏప్రిల్ నాటికి రాజ్య‌స‌భ‌లో మొత్తం 59 ఎంపీల ప‌ద‌వీకాలం ముగియ‌నుంది. బీజేపీ నుంచి 17 మంది - కాంగ్రెస్ నుంచి 12 మంది ఆ జాబితాలో ఉన్నారు. కేంద్ర మంత్రులు జైట్లీ - జేపీ న‌డ్డా - ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ల వంటి సీనియ‌ర్ నేత‌లు మ‌రోసారి సీటు ద‌క్కించుకునే చాన్స్ ఉంది. తెలుగు రాష్ట్రాల‌నుంచి సీఎం ర‌మేష్ - రాపోలు ఆనంద భాస్క‌ర్, రేణుకా చౌద‌రి, దేవేంద‌ర్ గౌడ్ వంటి వారున్నారు. అయితే, వీరిలో సీఎం ర‌మేష్ కు మాత్ర‌మే మ‌ళ్లీ సీటు ద‌క్కే అవ‌కాశ‌మున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కు త‌గినంత సంఖ్యా బ‌లం లేక‌పోవ‌డంతో రేణుకా - చిరంజీవి - ఆనంద భాస్క‌ర్ - స‌చిన్ - రేఖ ల‌కు మ‌రో చాన్స్ ద‌క్క‌క‌పోవ‌చ్చట‌. అందులోనూ, స‌చిన్ - రేఖ‌ల‌కు రాజ్య‌స‌భ‌లో అతి తక్కువ హాజ‌రు శాతం ఉంద‌న్న విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో వారికి అవ‌కాశం లేద‌ట‌. చిరంజీవి కూడా ఇక‌పై పూర్తి స్థాయిలో సినిమాల‌కు స‌మ‌యం కేటాయించాల‌నే ఆలోచ‌న నేప‌థ్యంలో ఆయ‌న‌కు  సీటు ద‌క్క‌క‌పోవ‌చ్చని తెలుస్తోంది.
Tags:    

Similar News