ఊరికిచ్చిన మాట మ‌ర‌చిన సచిన్!

Update: 2016-08-30 07:50 GMT
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్... అభిమానులు క్రికెట్ దేవుడు అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే, ఆ గ్రామ ప్ర‌జ‌ల‌కు నిజంగానే దేవుడిలానే క‌నిపించాడు. పుట్టంరాజువారి కండ్రిక... నెల్లూరు జిల్లాలోని ఈ గ్రామాన్ని స‌చిన్ ద‌త్త‌త తీసుకున్న సంగ‌తి గుర్తుండే ఉంటుంది. త‌మ గ్రామాన్ని సచిన్ ద‌త్త‌త తీసుకున్నాడు అని తెలియ‌గానే అక్క‌డి ప్ర‌జ‌లు పండుగ చేసుకున్నారు. స‌చిన్ త‌మ గ్రామానికి వ‌స్తున్నాడని తెలిసి - కొత్త బ‌ట్టలు కొనుక్కుని మ‌రీ సంబ‌రాలు చేసుకున్నారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్‌... స‌చిన్ టెండూల్క‌ర్ సూప‌ర్ స్టార్ అంటూ పాట‌లు పాడుకున్నారు. స‌చిన్ అడుగుపెట్టిన త‌మ నేల బంగారం అయిపోతుంద‌నుకున్నారు. త‌మ క‌ష్టాలు క‌డ‌తేరిపోతాయ‌ని క‌ల‌లు క‌న్నారు. ‘మీకు తోడుగా నేనుంటా’ అని స‌చిన్ అనేస‌రికి దేవుడే దిగి వ‌చ్చి - వ‌ర‌మిచ్చిన‌ట్టు భావించారు ఆ గ్రామ రైతులు - మ‌హిళ‌లు - యువ‌కులు! అయితే, ఇదంతా గ‌తం. ఒక‌ప్పుడు స‌చిన్ ను దేవుడు అని పొడిగిన నోళ్లే... ఇప్పుడు విమ‌ర్శిస్తున్నాయి. స‌చిన్ ను కొండంత అండ‌గా చూసిన క‌ళ్లు, ఎదురుచూపుల‌తో విసిగి వేశారిపోతున్నాయి.

2014లో ఎంతో అట్ట‌హాసంగా పుట్టంరాజువారి కండ్రిక గ్రామాన్ని ద‌త్త‌త తీసుకున్నాడు క్రికెట్ దేవుడు. త‌న‌కు వ‌చ్చిన ఎంపీ నిధుల్లో రూ. 2 కోట్ల 90 ల‌క్ష‌లు ఆ గ్రామానికి ఇచ్చాడు. ప్ర‌భుత్వం మ‌రో రూ. 3 కోట్లు ఇచ్చింది. ఈ నిధుల‌తో ర‌హ‌దారులు - మంచినీటి ప‌థ‌కం - పాఠ‌శాల భ‌వ‌నం - క‌మ్యూనిటీ హాళ్ల‌ను నిర్మించారు. ఆ ప‌క్క‌నే ఉన్న మ‌రో రెండు గ్రామాల‌కు కూడా నీటి ప‌థ‌కాన్ని అనుసంధానం చేశారు. ఇంకేముంది... త్వ‌ర‌లోనే త‌మ త‌ల‌రాత‌లు స‌మూలంగా మారిపోతాయ‌ని ప్ర‌జ‌లు అనుకున్నారు. అంతే.. ఆ త‌రువాతి నుంచి పుట్టంరాజువారి కండ్రికకు స‌చిన్ రాలేదు! ఇంత‌వ‌ర‌కూ మ‌ళ్లీ తొంగి చూసింది లేదు. గ్రామంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను స‌చిన్ మేనేజ‌ర్లు కొన్నాళ్లు త‌ర‌చూ వ‌చ్చి స‌మీక్షించేవార‌ట‌. కానీ, రానురానూ వారూ రావ‌డం మానేశారు. దీంతో క్రికెట్ దేవుడి ద‌త్త గ్రామంలో చాలా ప‌నులు పెండింగ్‌ లో ప‌డిపోయాయి.

యువ‌కులను ప్రోత్స‌హించేందుకు మైదానం ఏర్పాటు చేస్తామ‌న్నారు. ప‌నులు ప్రారంభం అయ్యాయి - అర్ధంత‌రంగా అట‌కెక్కాయి! గ్రామంలోని చిన్నారుల‌కు కంప్యూట‌ర్లు అందుబాటులోకి తెస్తామ‌న్నారు. ఆ వాగ్దాన‌మూ నీటి మూట‌గా మారిపోయింది. విద్యా ప్ర‌మాణాలు పెంచుతామ‌న్నారు, ప్ర‌మాణ‌పూర్తిగా ఆ మాట‌ను మ‌ర‌చిపోయారు! ద‌త్త‌త తీసుకున్నాక పుట్టంరాజువారి కండ్రిక గ్రామంలో కొన్ని అభివృద్ధి ప‌నులు జ‌రిగాయి... కాద‌లేం! కానీ, ఆ పనుల వ‌ల్ల గ్రామ ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల్లో మార్పు రావాలి క‌దా! అప్పుడే ద‌త్త‌త‌కు సార్థ‌క‌త ఉంటుంది క‌దా. అలాంటి గుణాత్మ‌క‌మైన మార్పులేవీ ప్ర‌జ‌ల జీవితాల్లో చోటు చేసుకోలేదు.

ఏదో భ‌విష్య‌త్తు అద్భుతంగా ఉంటుంద‌ని ఆశిస్తే... ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగానే మిగిలిపోయింద‌ని గ్రామ‌స్థులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. స‌చిన్ వ‌స్తాడ‌ని ఎన్నాళ్ల‌ని ఎదురుచూడాలి అంటున్నారు. నిజానికి, స‌చిన్ ద‌త్త‌త తీసుకున్నాక ఎంపీ నిధుల‌ను మాత్ర‌మే ఖ‌ర్చు చేశాడు, మిగ‌తా సొమ్మును ప్ర‌భుత్వం ఇచ్చింది. ఈ గ్రామానికి సొంతంగా స‌చిన్ చేసింది ఏమైనా ఉందా..? త‌న జేబులోంచి ఒక్క రూపాయి అయినా ఖ‌ర్చు పెట్టారా... అనే ప్ర‌శ్న‌లు కూడా వినిపిస్తున్నాయి. మ‌రి, క్రికెట్ దేవుడికి ఈ ప్ర‌జ‌ల క‌ష్టాలు వినిపించ‌వా..? ఇచ్చిన మాట‌లు, తీసుకున్న ద‌త్త‌త గుర్తుకు రాదా..?
Tags:    

Similar News