ప‌రువు పోగొట్టే ప‌ని ఎందుకు చేయ‌డం స‌చిన్‌

Update: 2017-04-11 13:23 GMT
వాళ్లు ఎంపీలే.. కానీ స‌భ‌లో ఎప్పుడూ క‌నిపించ‌రు. ఐదేళ్ల‌లో వాళ్లు స‌భ‌కు హాజ‌రైన సంద‌ర్భాలను వేళ్ల మీద లెక్క‌పెట్టొచ్చు. ఒక్క చ‌ర్చ‌లోనూ మాట్లాడిన పాపాన పోలేదు. ఆ ఎంపీలు ఎవ‌రో కాదు.. రాష్ట్ర‌ప‌తి నామినేట్ చేసిన మాజీ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌, బాలీవుడ్ న‌టి రేఖ‌. తాజాగా విడుద‌ల చేసిన అటెండెన్స్ జాబితాలో ఈ ఇద్ద‌రివే చివ‌రి స్థానాలు. 348 రోజుల్లో స‌చిన్ కేవ‌లం 23 రోజులు స‌భ‌కు రాగా.. గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చిన‌ట్లు రేఖ 18 రోజులు మాత్ర‌మే స‌భ‌లో క‌నిపించింది.

2012లో ఈ ఇద్ద‌రూ రాజ్య‌స‌భ‌కు నామినేట్ అయ్యారు. వీరితో పాటు నామినేట్ అయిన మిగ‌తా 10 మందిలో ఈ ఇద్ద‌రి హాజ‌రుశాత‌మే మ‌రీ త‌క్కువ‌గా ఉంది. స‌భ‌కు రాక‌పోయినా అంద‌రి క‌న్నా ఎక్కువ‌గా ఖ‌ర్చు పెట్టింది మాత్రం రేఖ‌పైనే కావ‌డం ఇక్క‌డ మ‌రో ట్విస్ట్‌. జీతం, ఇత‌ర ఖ‌ర్చులు క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు రేఖ కోసం వెచ్చించిన మొత్తం రూ.65 ల‌క్ష‌లు. అటు స‌చిన్‌పై రూ.58.8 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశారు. అంటే ఒక్క రోజుకు రేఖ‌కు చెల్లించిన మొత్తం రూ.3,60,000 కాగా.. స‌చిన్‌కు రూ.2,56,000 ఖ‌ర్చ‌యింది. ఒక్క అల‌వెన్సులు త‌ప్ప మిగ‌తా అన్నీ ప్ర‌తి స‌భ్యుడికి ఒకే ర‌కంగా ఉంటుంది. ఓ స‌భ్యుడు ఎక్కువ‌సార్లు స‌భ‌కు వ‌స్తే అత‌నిపై ఖ‌ర్చు ఎక్కువ‌గా ఉంటుంది. కానీ రేఖ విష‌యంలో అది రివ‌ర్స్ కావ‌డం మ‌రో విశేషం. ఇదే విష‌యాన్ని స‌మాజ్‌వాదీ పార్టీ ఎంపీ న‌రేశ్ అగ‌ర్వాల్ రాజ్య‌స‌భ‌లో లేవ‌నెత్తారు. ఈ ఇద్ద‌రూ అస‌లు స‌భ‌లో ఎప్పుడూ క‌నిపించ‌రేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఇప్ప‌టివ‌ర‌కు రేఖ స‌భ‌లో కేవ‌లం ఒక్క ప్ర‌శ్న మాత్ర‌మే అడిగింది. అదే స‌చిన్ మాత్రం 22 ప్ర‌శ్న‌లు అడిగి ప‌ర్వాలేద‌నిపించాడు. ఇక ఎంపీ ల్యాడ్స్ కింద ఈ ఐదేళ్ల‌లో రూ.25 కోట్లు అందుబాటులో ఉండ‌గా.. స‌చిన్ రూ.21.19 కోట్ల విలువైన ప‌నుల‌ను ప్ర‌తిపాదించాడు. అందులో రూ.17.65 కోట్లు విడుద‌ల‌య్యాయి. ఇక రేఖ రూ.9.28 కోట్ల ప‌నుల‌కు ప్ర‌తిపాదించ‌గా.. రూ.7.6 కోట్లు విడుద‌ల‌య్యాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News