క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన పెద్ద మనసును చాటుకున్నారు. ఆరేళ్లు ఎంపీగా ఉన్నా...సభకు సరిగా రావడం లేదని సచిన్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇలా విమర్శలు - అసంతృప్తుల నడుమ సచిన్ రాజ్యసభ పదవీకాలం ఈ మధ్యే ముగిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అతడు చేసిన ఓ మంచి పని స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ ఆరేళ్లలో ఎంపీగా తనకు వచ్చిన జీతం - ఇతర అలవెన్సుల మొత్తాన్ని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చేశాడు మాస్టర్ బ్లాస్టర్. ఈ ఆరేళ్లలో సచిన్ కు జీతభత్యాల రూపంలో మొత్తం రూ.90 లక్షలు వచ్చాయి.
సచిన్ విరాళాన్ని గుర్తిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం ఓ లేఖను విడుదల చేసింది. `ఇది చాలా మంచి పని అని, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది` అని పీఎంవో కొనియాడింది. మరోవైపు సచిన్ తన ఎంపీ లాడ్స్ ను మాత్రం సరిగ్గా వినియోగించుకున్నాడు. టెండుల్కర్ కార్యాలయం విడుదల చేసిన సమాచారం ప్రకారం విద్య - మౌలిక సదుపాయాలైన పాఠశాల భవనాలు కట్టించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలకు రూ.30కోట్లు కేటాయించారు. రూ.7.4కోట్ల విలువైన 185 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారు. తనకు ఈ ఆరేళ్లలో వచ్చిన రూ.30 కోట్ల నిధులను దేశవ్యాప్తంగా 185 పనులకు ఉపయోగించారు. అందులో రూ.7.4 కోట్లు కేవలం విద్య - దాని అనుబంధ రంగాలకు సచిన్ ఖర్చు చేయడం గమనార్హం.
ఇక సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోజన కింద సచిన్ రెండు ఊళ్లను కూడా దత్తతకు తీసుకున్నాడు. మహారాష్ట్రలోని దోంజా - ఏపీలోని పుట్టంరాజు కండ్రిగ గ్రామాలను అతను దత్తతకు తీసుకొని అభివృద్ధి చేశాడు. ఇప్పుడు తన జీతభత్యాల మొత్తాన్నీ విరాళంగా ఇచ్చి మరోసారి పెద్ద మనసు చాటుకున్నాడని పలువురు ప్రశంసిస్తున్నారు.