వ‌న్డే సెంచ‌రీల్లో టాప్ త్రీ పొజిష‌న్ల‌లో ఇండియ‌న్సేనా!

Update: 2020-01-20 05:19 GMT
క్రికెట్ లో వ‌న్డే సెంచ‌రీల విష‌యంలో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్కర్ సాధించిన ఫీటే ఎవ‌రికీ అంద‌దు అని అంతా అనుకున్నారు. 49 వ‌న్డే సెంచ‌రీల‌తో సచిన్ సంచ‌ల‌నంగా నిలిచాడు. వ‌న్డేల్లో 49 - టెస్టుల్లో 51 సెంచ‌రీల‌తో స‌చిన్ వంద సెంచ‌రీలు చేసి అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్డ్ అయ్యాడు. ఆ రికార్డును ఎవ‌రూ అందుకోలేర‌ని అనేక మంది భావించారు. అయితే వ‌డివ‌డిగా స‌చిన్ రికార్డుకు చేరువ అవుతున్నాడు విరాట్ కొహ్లీ. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ ఆట‌గాడు 43 వ‌న్డే సెంచ‌రీలు సాధించాడు. మ‌రో ఆరు సెంచ‌రీలు చేస్తే.. స‌చిన్ తో స‌మానం కాబోతున్నాడు కొహ్లీ. ఏడు సెంచ‌రీలు సాధిస్తే.. 50 సెంచ‌రీల‌తో స‌రికొత్త రికార్డును స్థాపించే అవ‌కాశాలున్నాయి.

ఇక విరాట్ వెంట సాగుతూ ఉన్నాడు టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌. ఆసీస్ తో వ‌న్డే సీరిస్ లో భాగంగా మూడో వ‌న్డేలో శ‌ర్మ సెంచ‌రీ చేశాడు. ఇది కెరీర్ లో అత‌డికి 29వ సెంచ‌రీ. త‌ద్వారా అత్య‌ధిక వ‌న్డే సెంచ‌రీల విష‌యంలో నాలుగో స్థానంలో నిలుస్తున్నాడు శ‌ర్మ‌.

30 సెంచ‌రీల‌తో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ మూడో స్థానంలో ఉన్నాడు. మ‌రో సెంచ‌రీ చేస్తే శ‌ర్మ పాంటింగ్ తో స‌మానంగా నిలుస్తాడు. అయితే పాంటింగ్ 375 మ్యాచ్ ల‌కు గానూ 30 సెంచ‌రీలు చేయ‌గ‌లిగాడు. అదే శ‌ర్మ ఇంకా 224 మ్యాచ్ ల‌లోనే పాంటింగ్ రికార్డుకు చేరువ అయ్యాడు. మ‌రో రెండు సెంచ‌రీల‌ను కొడితే శ‌ర్మ వ‌న్డే సెంచ‌రీల విష‌యంలో మూడో స్థానాన్ని సొంతం చేసుకుంటాడు.

స‌చిన్ - కొహ్లీ - శ‌ర్మ‌.. ఇలా వ‌న్డే సెంచ‌రీల విష‌యంలో టాప్ త్రీ పొజిష‌న్లూ భార‌తీయుల సొంత‌మే అవుతాయి. ఆ త‌ర్వాత స‌చిన్ రికార్డును కొహ్లీ త‌న పేరు మీద‌కు మార్చుకున్నా.. మూడు స్థానాలూ ఇండియ‌న్స్ సొంతం అవుతాయి.
Tags:    

Similar News