ఈటెలకు షాకిచ్చిన సన్నిహితుడు.. గులాబీ కారు ఎక్కేందుకు రెఢీ?

Update: 2023-02-26 10:52 GMT
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న బీఆర్ఎస్.. ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు వచ్చే ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టటం లేదు. అంతేకాదు.. నిరంతరం ఏదో ఒక యాక్టివిటీతో దాని స్థైర్యాన్ని దెబ్బ తీయటమే పనిగా పెట్టుకుంది బీఆర్ఎస్. తనకు కంట్లో నలుసులా మారిన బీజేపీని దెబ్బ తీసేందుకు వచ్చే చిన్న అవకాశాన్ని సైతం వదిలిపెట్టకుండా దానికి భారీ ఎత్తున ప్రచారం చేస్తూ ఆగమాగం చేస్తోంది.

తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించింది బీఆర్ఎస్.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఒకటి కంటోన్మెంట్. నిజానికి రెండు రోజుల క్రితం కంటోన్మెంట్ బోర్డుకు ఎన్నికల నజరానా మోగింది.

ఇలాంటి తరుణంగా బీజేపీకి షాకిస్తూ.. ఆ పార్టీకి చెందిన ఒక నేతను బీఆర్ఎస్ లోకి చేరేందుకు మంతనాలు పూర్తి చేశారు. అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ట్విస్టు ఏమంటే.. ఈ కంటోన్మెంట్ నేత.. తెలంగాణ బీజేపీ చేరికల కమిటీకి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితుడు కావటం.

ఆయన పేరు సదా కేశవరెడ్డి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆయన మరోసారి గులాబీ కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నారు.ఇప్పటికే తనకు మద్దతుగా నిలిచే కీలక నేతలతో చర్చలు జరుపుతున్న ఆయన.. పార్టీ మారిన విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తారని చెబుతున్నారు.

గతంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన పలువురు ఈటల ఫాలోయర్స్. ఆయన  కమలం పార్టీ తీర్థం పుచ్చుకునే వేళ.. తనతో పాటు తనకు అండగా నిలిచే వారిని బీజేపీలో చేర్చారు. ఆ కోవలోకే వస్తారు సదా కేశవరెడ్డి. రెండుసార్లు (2008, 2015) కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో వార్డు నుంచి గెలిచిన ఆయన.. గత ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంలో బోర్డు ఉపాధ్యక్షుడి హోదాను సొంతం చేసుకున్నారు.

బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరేందుకు కసరత్తు మొదలైందన్న వార్తల నేపథ్యంలోకమలనాథులు అలెర్టు అయ్యారు. కేశవరెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే.. అందుకుఆయన ససేమిరా అంటున్నట్లు చెబుతున్నారు. తాజా పరిణామం ఈటలకు బాగా ఇబ్బంది కలిగించే పరిణామంగా చెబుతున్నారు. తనకు అత్యంత సన్నిహితుడు బీఆర్ఎస్ లోకి చేరటంపై ఈటల ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.

Similar News