వివాదంలో సైనా.. రచ్చకు కారణమైన ట్వీట్ లో ఏముంది?

Update: 2021-07-06 03:50 GMT
అయితే ఆట.. లేదంటే కాసిన్ని వాణిజ్య ప్రకటనలు చేసుకుంటూ తన దారిన తాను బతికే క్రీడాకారిణిగా సైనానెహ్వాల్ ను చెబుతారు. మొదట్నించి  వివాదాలకు దూరంగా ఉంటూ.. ఆట చుట్టూనే ఆమె పేరు వినిపించేది. చివరకుఆమె లవ్ ట్రాక్ సైతం గుట్టుగా.. గోప్యంగా సాగింది. ఒకసారి డిసైడ్ అయినంతనే.. ఇరు వర్గాల ఇళ్లల్లో మాట్లాడుకోవటం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవటం జరిగిపోయాయి. ఇలా ఏం చేసినా.. పెద్ద హడావుడి చేయకుండా.. మీడియాలో ప్రముఖంగా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాంటి ఆమె ఆ మధ్యన బీజేపీలో చేరటం తెలిసిందే.

ఇటీవల వెల్లడైన యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయాన్ని సాధించినట్లుగా ఆ పార్టీ పేర్కొనటం తెలిసిందే. దీనికి విపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నాయి. పార్టీ గుర్తు లేకుండా పోటీ చేసి గెలిచిన వారిలో ఎక్కువ మంది బీజేపీయేతరులేనని.. ఫలితం వచ్చాక తమ వైపునకు తిప్పేసుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. భారత షట్లర్ సైనా నెహ్వాల్.. ఈ ఎన్నికల ఫలితాలపై చేసిన ట్వీట్ ఇప్పుడు మరో వివాదంగా మారింది.

ఆమె చేసిన ట్వీట్ కు విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. జిల్లా పంచాయత్ ఛైర్ పర్సన్ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయాన్ని సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు అంటూ సైనా ట్వీట్ చేశారు. దీనిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆమెను సర్కారీ షట్లర్ అంటూ రాష్ట్రీయ లోక్ దళ్ జాతీయ అధ్యక్షుడు విమర్శించారు. అదే సమయంలో ప్రజలు ఇచ్చిన తీర్పును ధ్వంసం చేయటంలో బీజేపీకి ఉన్న నైపుణ్యాన్ని.. ఈ సర్కారీ షట్లర్ గుర్తించినట్లుగా పలువురు నేతలుమండిపడుతున్నారు.

ఎన్నికల్లో గెలుపుపై అభినందనలు తెలియజేసేందుకు సైనా చేసిన ప్రయత్నం ఫలించక పోగా.. మిస్ ఫైర్అయినట్లుగా చెబుతున్నారు. ఒక క్రీడాకారిణిగా సుపరిచితురాలైన సైనా.. బీజేపీ తీర్థం పుచ్చుకోవచ్చు. కానీ.. ఆమె చేసే వ్యాఖ్యల విషయంలో వెనుకా ముందు చూసుకుంటే మంచిదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News